గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 22, 2020 , 14:39:18

డెంగ్యూ వ‌చ్చిందంటే.. కోవిడ్ రాన‌ట్లే !

డెంగ్యూ వ‌చ్చిందంటే.. కోవిడ్ రాన‌ట్లే !

హైద‌రాబాద్‌: ఇదో విచిత్ర వాద‌న అనుకోకండి. బ్రెజిల్‌లో కొంద‌రు ప‌రిశోధ‌కులు ఓ విష‌యాన్ని క‌నుగొన్నారు. డెంగ్యూ వ్యాధి ప్ర‌బ‌లిన ప్ర‌దేశాల్లో.. కోవిడ్‌19 ఉదృతి త‌క్కువ‌గా ఉన్న‌ట్లు గుర్తించారు.  దోమ‌కాటుతో వ‌చ్చే డెంగ్యూ  వ్యాధి చాలా ప్ర‌మాద‌క‌ర‌మైనది. ర‌క్తంలో ప్లేట్‌లెట్స్ శ‌ర‌వేగంగా ప‌డిపోతాయి. వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి దారుణంగా త‌గ్గిపోతుంది. అయితే ఆ స‌మ‌యంలో  డెంగ్యూ రోగులు తీసుకునే యాంటీబాడీలే.. వారిని కోవిడ్ నుంచి కాపాడుతున్న‌ట్లు తెలుస్తోంది.  వాస్త‌వానికి ఈ అధ్య‌య‌నానికి సంబంధించిన రిపోర్ట్‌ను ప్ర‌చురించ‌లేదు.  డ్యూక్ వ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ మిగుల్ నికోలెసిస్ దీనిపై నివేదిక‌ను త‌యారు చేశారు. భౌగోళికంగా 2019లో డెంగ్యూ ప్ర‌బ‌లిన ప్రాంతాల్లో.. ఈ ఏడాది క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌లేద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు.  గ‌త ఏడాది అత్య‌ధిక స్థాయిలో డెంగ్యూ కేసులు న‌మోదు అయిన ప్రాంతాల్లో కోవిడ్ ప్ర‌భావం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు నికోలెసిస్ చెప్పారు. 

డెంగ్యూలోని ఫ్లావివైర‌స్‌,  కోవిడ్‌లోని సార్స్ సీవోవీ2 వైర‌స్‌ల‌కు ఇమ్యూనిటీ ఒకే విధంగా స్పందిస్తున్న‌ట్లు అంచ‌నాకు వ‌చ్చారు. ప్ర‌స్తుతానికి త‌మ వాద‌న ఊహాజ‌నిత‌మే అయినా.. డెంగ్యూ కోసం ఇచ్చే టీకాల‌ను.. కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఇస్తే .. దాని వ‌ల్ల ఫ‌లితం ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. డెంగ్యూ యాంటీబాడీలు ఉన్న‌వారు... కోవిడ్ యాంటీబాడీ ప‌‌రీక్ష‌లో  పాజిటివ్‌గా తేలుతున్నార‌ని, క‌రోనా వైర‌స్ సోక‌ని వారు కూడా పాజిటివ్ వ‌స్తున్న‌ట్లు నికోలెసిస్ తెలిపారు. రెండు వైర‌స్ విభిన్న కుటుంబాల‌కు చెందిన‌వే అయినా.. ఇమ్యూనిటీ అంశంలో రెండూ ఒక‌టిగా ఉన్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు.  అమెరికా, భార‌త్ త‌ర్వాత బ్రెజిల్‌లోనూ అత్య‌ధిక పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే గ‌త ఏడాది ప‌రానా, సాంటా క్యాట‌రినా, రియో గ్రాండ్ డూ సుల్‌, మాటో గ్రోసో డు సుల్‌, మినాస్ గెరాయిస్ లాంటి రాష్ట్రాల్లో డెంగ్యూ విజృంభించింది. అయితే ఆ రాష్ట్రాల్లో చాలా ఆల‌స్యంగా కోవిడ్ కేసులు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ప్రొఫెస‌ర్ తెలిపారు.


logo