శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 17, 2020 , 16:20:03

బెలారస్‌లో మిన్నంటిన నిరసనలు

బెలారస్‌లో మిన్నంటిన నిరసనలు

మిన్స్క్ : బెలారస్‌లో గత వారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోకు వ్యతిరేకంగా నిరసనలు ముమ్మరమయ్యాయి. రాజధాని మిన్స్క్‌లో లుకాషెంకో రాజీనామాను కోరుతూ సుమారు 2 లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. అధికారాన్ని సంపాదించడానికి లుకాషెంకో ఎన్నికలను రిగ్గింగ్ చేశారని నిరసనకారులు ఆరోపించారు. గత ఏడు రోజులుగా లుకాషెంకోకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు నిరసనకారులు మరణించగా.. వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వారం రోజుల్లో రెండుసార్లు లుకాషెంకోతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. లుకాషెంకోకు సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అవసరమైనప్పుడు ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం బెలారస్‌కు సైనిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ అన్నట్లు కొన్నివర్గాలు చెప్తున్నాయి.

గత 26 సంవత్సరాలుగా బెలారస్ అధ్యక్షుడిగా టుకాషెంకో ఉన్నారు. అతడిని దేశ చివరి నియంతగా అని కూడా పిలుస్తుంటారు. తనపై నిరసనలు తీవ్రతరం కావడంతో నాటో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నిందని లుకాషెంకో ఆరోపించారు. ఫిరంగులు, యుద్ధ విమానాలను బెలారస్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ప్రాంతాలకు నాటో మోహరించిందని లుకాషెంకో ఆరోపిస్తున్నారు. బెలారస్ పరిణామాలపై మా దృష్టి ఉన్నదని మరోవైపు నాటో పేర్కొన్నది. కాని సైన్యం మోహరింపునకు సంబంధించిన వాదనలు నిరాధారమైనవి నాటో కొట్టిపారేసింది.

రష్యా పశ్చిమ సరిహద్దులో ఉన్న బెలారస్.. 1991 ఆగస్టు 25 న సోవియట్ యూనియన్ నుంచి విడివడి స్వతంత్ర దేశంగా మారింది. మొదటి అధ్యక్ష ఎన్నికలు 1994 జూన్ లో జరుగగా.. అలెగ్జాండర్ లుకాషెంకో అధ్యక్షుడయ్యాడు. 1994 నుండి ఐదుసార్లు జరిగిన ఎన్నికల్లో లుకాషెంకో గెలుస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక గందరగోళం చేసి గెలుస్తాడన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

రష్యాకు ఇంధనాన్ని అందించే పైప్‌లైన్ బెలారస్ గుండా వెళుతుంది. నాటోకు వ్యతిరేకంగా బెలారస్‌ను రష్యా తన బఫర్ జోన్‌గా పరిగణిస్తుంది. బెలారస్‌లో దాని ప్రవేశం తగ్గాలని రష్యా కోరుకోలేదు. దేశంలో లుకాషెంకో అధికారాన్ని తారుమారు చేస్తే రష్యా నష్టపోవచ్చు. దీనితో పాటు రష్యా, బెలారస్ మధ్య పరస్పర సహకారం కోసం ఒప్పందాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల లుకాషెంకోకు పుతిన్ మద్దతు ఇస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


logo