బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 04, 2020 , 17:33:24

ఫుడ్‌ను డెలివరీ చేసినట్లు ఫొటో తీసి చోరి

ఫుడ్‌ను డెలివరీ చేసినట్లు ఫొటో తీసి చోరి

వాషింగ్టన్‌: ఫుడ్‌ డెలివరీ చేసే వ్యక్తే దానిని చోరీ చేసిన ఘటన వెలుగుచూసింది. ఒక కస్టమర్‌ ఆర్డర్‌ ఇచ్చిన ఫుడ్‌ను డోర్‌ డెలివరీ చేసినట్లు ఫొటో తీసి అనంతరం దానిని తన వెంట తీసుకెళ్లడాన్ని సీసీటీవీ పట్టిచ్చింది. అమెరికాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. కరోనా నేపథ్యంలో కొన్ని సంస్థలు ఆర్డర్‌ ఇచ్చిన ఫుడ్‌ను నేరుగా కస్టమర్‌ చేతికి ఇ్వవకుండా వారు నిర్దేశించిన చోట ఉంచేలా చూస్తున్నారు. అయితే ఆ ఫుడ్‌ను ఆ చోట ఉంచినట్లు ఫొటో తీయాలని డెలివరీ సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డోర్‌ డాష్‌ అనే ఫుడ్‌ డెలివరీ సంస్థకు చెందిన మహిళా డ్రైవర్‌, ఫుడ్‌ ఆర్డర్‌తో ఒక ఇంటికి వచ్చి దానిని డోర్‌ వద్ద ఉంచింది. ఫుడ్‌ను కస్టమర్‌కు అందజేసినట్లుగా ఫొటో తీసుకున్నది. అనంతరం ఆ ఫుడ్‌ను తన వెంట తీసుకొని వెళ్లిపోయింది. అయితే ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డు అయ్యింది. 

ఒక టిక్‌టాక్ యూజర్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘అక్కడ కెమేరాలు లేవనుకున్నావా.. నీవు చేసిన పనికి డోర్‌ డాష్‌ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించి ఉంటుంది’ అని కామెంట్‌ చేశారు. మరోవైపు ఈ వీడియోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది. టిక్‌టాక్‌లోనే కోటి మందికిపైగా దీనిని వీక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.