శనివారం 06 జూన్ 2020
International - May 23, 2020 , 02:49:48

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం

  • 107 మంది దుర్మరణం
  • దిగడానికి ఒక్క నిమిషం ముందే
  • కరాచీ  వీధుల్లో క్రాష్‌ ల్యాండింగ్‌
  • పదికిపైగా భవనాలు ధ్వంసం
  • పలువురికి తీవ్ర గాయాలు

రంజాన్‌ పండుగ ముంగిట పాకిస్థాన్‌లో పెను విషాదం. మరో నిమిషంలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుతుందనుకున్న విమానం.. మృత్యుశకటమైంది. సాంకేతిక లోపాలు శాపాలై రెండు ఇంజిన్లను దెబ్బతీయడంతో విమానం అదుపుతప్పి జనావాసాలపై కూలిపోయింది. ఈ దుర్ఘటన కరాచీ విమానాశ్రయం సమీపంలో జరిగింది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘పీకే-8303’ విమానం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు లాహోర్‌ నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం 2:45 గంటలకు కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉండగా.. కొంతసేపటి ముందు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. క్రాష్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని జనావాసాలపై కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న 107 మంది మరణించినట్టు కరాచీ మేయర్‌ ప్రకటించారు. ప్రమాదంలో పదికిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. కూలిన ఇండ్లు, విమాన శకలాలు, కాలిపోతున్న వాహనాలతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొన్నది. 

కరాచీ, మే 22: మరో నిమిషంలో ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానం.. సమీపంలోని జనావాసాలపై కుప్పకూలింది. మరో నాలుగురోజుల్లో రంజాన్‌ పండుగను జరుపుకొనేందుకు సిద్ధమవుతున్న అనేక కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో శుక్రవారం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 107 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారంతా మృతిచెందినట్టు కరాచీ మేయర్‌ తెలిపారు. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రాలేదు. ఇప్పటివరకు 66 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు.    పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘పీకే-8303’ (ఎయిర్‌బస్‌ ఏ320) విమానం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు లాహోర్‌ నుంచి కరాచీకి బయలుదేరింది. మధ్యాహ్నం 2:45 గంటలకు కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉన్నది. అయితే ల్యాండింగ్‌కు కొంతసేపటి ముందు విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ల్యాండింగ్‌ గేర్‌ పనిచేయడం లేదని పైలట్‌ మధ్యాహ్నం 2:37 గంటలకు ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌' (ఏటీసీ)కు సమాచారం ఇచ్చారు. క్రాష్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరగా ల్యాండింగ్‌కు ఒక్క నిమిషం ముందు ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఉన్న జిన్నా గార్డెన్‌ ప్రాంతంలోని జనావాసాలపై కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 31 మంది మహిళలు, తొమ్మిది మంది పిల్లలు సహా.. 98 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. కూలడానికి కొన్ని క్షణాల ముందు విమానం రెక్కలకు మంటలు అంటుకున్నాయని, మొదట ఓ సెల్‌ఫోన్‌ టవర్‌ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ‘ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య ఉన్నదని విమానం కెప్టెన్‌ సజ్జద్‌ గుల్‌ సమాచారం ఇవ్వడంతో అత్యవసర ల్యాండింగ్‌కు రెండు రన్‌వేలను సిద్ధం చేశాం. మొదటి ప్రయత్నం విఫలమైంది. రెండోసారి ల్యాండిగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది’ అని పాక్‌ ఎయిర్‌లైన్స్‌ చైర్మన్‌ అర్షద్‌ మాలిక్‌ తెలిపారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతామన్నారు. 

కాలనీలో బీతావహ దృశ్యాలు 

విమానం ఇండ్లపై కూలిపోయి మంటలు అంటుకోవడంతో ఘటనాస్థలంలో బీతావహ దృశ్యం నెలకొన్నది. ప్రమాదంలో కనీసం 10 భవనాలు ధ్వంసమైనట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. విమానంతోపాటు ఇండ్లు, కార్లు, ఇతర వాహనాలు, నిర్మాణాలకు మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితోపాటు సైన్యం సైతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నది. కాలిన గాయాలతో 30-40 మంది స్థానికులు దవాఖానలో చేరినట్టు అధికారులు తెలిపారు. ఆశ్చర్యకరంగా ఇద్దరు ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారన్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి, ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావెద్‌ బజ్వా సంతాపం ప్రకటించారు. పాక్‌లో కొన్ని వారాల లాక్‌డౌన్‌ అనంతరం ఈ నెల 16 నుంచి దేశీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించారు.పైలట్‌, ఏటీసీ మధ్య చివరి సంభాషణ 

విమానాల గమనాన్ని ట్రాక్‌ చేసే ‘లైవ్‌ఏటీసీ.నెట్‌' సంస్థ పాక్‌ విమానం పైలట్‌, ఏటీసీ మధ్య సంభాషణ ఆడియో క్లిప్‌ను తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. దీని ప్రకారం పైలట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన చివరి సంభాషణ.  

పైలట్‌: మేము ఎడమవైపు తిరుగుతున్నాం. 

ఏటీసీ: సరే. 

పైలట్‌: మేము ముందుకు వస్తున్నాం. మా రెండు ఇంజిన్లు చెడిపోయాయి. 

ఏటీసీ: మీరు బెల్లీ (క్రాష్‌) ల్యాండింగ్‌ చేస్తున్నారా?. రన్‌వే 2,5 సిద్ధంగా ఉన్నాయి. 

పైలట్‌: సరే సర్‌.. మేడే.. మేడే.. మేడే.. 

పాకిస్థాన్‌ 8303........ 

(ఇక్కడితో ఆడియో కట్‌ అయ్యింది)


logo