ఆదివారం 12 జూలై 2020
International - Jun 07, 2020 , 03:41:39

జాతివివక్షపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

జాతివివక్షపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

  • దేశదేశాల్లో.. ఫ్లాయిడ్‌!
  • ఆస్ట్రేలియా, యూరప్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు

మినియాపొలిస్‌/బెర్లిన్‌: జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా అమెరికాలో మొదలైన ఆందోళనలకు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తుతున్నది. జాతివివక్షపై అంతర్జాతీయ ఉద్యమంగా ఇది రూపుదిద్దుకుంటున్నది. ఫ్లాయిడ్‌కు మద్దతుగా ఆస్ట్రేలియా, యూరప్‌లలో శనివారం వేలాది మంది ఆందోళన చేపట్టారు. పారిస్‌లో నిషేధాజ్ఞలను ధిక్కరించి అమెరికా రాయబార కార్యాలయం ముందు ఆందోళన చేపట్టేందుకు నిరసనకారులు యత్నించారు. అయితే  పోలీసులు వారిని అడ్డుకున్నారు. సిడ్నీ, లండన్‌, బ్రిస్బేన్‌, సియోల్‌, టోక్యో, బెర్లిన్‌ నగరాల్లోనూ వేల మంది నిరసనలు చేపట్టారు. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అంటూ నినదించారు. 

గొంతునొక్కిపట్టడంపై నిషేధం

జార్జ్‌ఫ్లాయిడ్‌ హత్య నేపథ్యంలో అమెరికాలోని మినియాపోలిస్‌ నగరం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్‌ అధికారులు ఇకపై ఎవరినైనా అదుపులోకి తీసుకునే సమయంలో వారి గొంతును గట్టిగా నొక్కిపట్టడానికి వీల్లేదు. ఈ మేరకు నగర, రాష్ట్ర అధికారుల మధ్య అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంపై సిటీ కౌన్సిల్‌ త్వరలోనే ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నది. దీని ప్రకారం.. ఇకపై ఏ పోలీస్‌ అయినా ఇతరుల గొంతును గట్టిగా నొక్కిపట్టితే తక్షణమే ఇతర పోలీసులు పై అధికారులకు సమాచారమివ్వాలి. అలాగే వారు నేరుగా జోక్యం చేసుకుని ఆ ఘటనను ఆపాలి. లేనిపక్షంలో వారిపైనా చర్యలు తీసుకుంటారు.  

ఆగస్టు 28న భారీ ర్యాలీ..

జాతి వివక్షకు నిరసనగా అమెరికావ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయి. ‘ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌' అంటూ మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ చేసిన చరిత్రాత్మక ప్రసంగం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 28న ఫ్లాయిడ్‌ సంస్మరణార్థం వాషింగ్టన్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు పౌరహక్కుల నాయకుడు రెవరెండ్‌ షార్‌ప్టన్‌ తెలిపారు.  మరోవైపు, వాషింగ్టన్‌లో శ్వేతసౌధానికి వెళ్లే రహదారిపై ‘బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌' అంటూ వలంటీర్లు భారీ పెయింటింగ్‌ను రూపొందించారు. 


logo