సోమవారం 01 జూన్ 2020
International - May 06, 2020 , 16:01:06

అమెరికా నెత్తి మీద పిడుగులాంటి కీటకం

అమెరికా నెత్తి మీద పిడుగులాంటి కీటకం

హైదరాబాద్: అసలే కరోనాతో కుదేలవుతున్న అమెరికాకు మరో గండం వచ్చిపడింది. ఈసారి అది సూక్ష్మక్రిమి కాదు.. భారీ కీటకం. దాని పేరు వెస్పా మండరీనియా ఉరఫ్ 'మర్డర్ హార్నెట్'. పేరే కొంచెం భయానకంగా ఉంది కదూ. కెనడా సరిహద్దు ప్రాంతాల్లో అది కనిపించడం మనుషులకు, తేనెటీగల పెంపకందార్లకు ప్రమాదమేనని అంటున్నారు.  వాషింగ్టన్ రాష్ట్రంలోని బ్లేన్‌లో ఆ కీటకాలను చూసినట్టు ఓ వ్యక్తి చెప్పాడు. తూర్పు ఆసియాలో, ముఖ్యంగా చైనా, తైవాన్లలో అవి ఎక్కువగా ఉంటాయి. ఏషియన్ జయంట్ హార్నెట్ అని కూడా పిలిచే హార్నెట్ పురుగు రెండున్నర అంగుళాల వరకు పెరుగుతుంది. అది కరిస్తే విషం ఎక్కుతుంది.

ఎన్నిసార్లు కరిస్తే అంత ఎక్కువ విషం విడుదల అవుతుంది. ఒకటి రెండు సార్లు అయితే పుండుపడి తగ్గుతుంది. అంతకంటే ఎక్కువైతే విషం ఎక్కువ అవుతుంది. మీర ఎక్కువైతే ప్రాణాంతకం కూడా కావచ్చు. వ్యవసాయానికి కూడా హార్నెట్ నుంచి ముప్పు ఉంటుంది. ముఖ్యంగా తేనెటీగల పెంపకంపై హార్నెట్ ప్రభావం ఉంటుంది. కొన్నిగంటల్లో అవి తేనెతుట్టెలను నాశనం చేస్తాయి. అవి తేనెటీగల తలలు విరిచి చంపేస్తాయి. తర్వాత తుట్టెల్లో తమ గుడ్లను పెడతాయి. తేనెటీగల లర్వాలు లేదా పిల్లలను తమ పిల్లలకు భోజనంగా వేస్తాయి. ఇంత ప్రమాదకరమైన హార్నెట్ పురుగులు ఇప్పటిదాకా రెండు చోట్ల కనిపించినట్టు వార్తలు అందాయి. కానీ ఇంకా నిర్ధారణలు అవసరమని అమెరికా వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఇంతకూ అది బ్లేన్ ప్రాంతానికి ఎలా వచ్చిందనేది ఓ మిస్టరీ. ఓడల నుంచి అది వచ్చి ఉంటుందని ఓ అంచనా. తేనెటీగల కొరకు ధరించే దుస్తులతో వీటి తుట్టెల దగ్గరకు వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటి కొండి 65 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది.


logo