గురువారం 21 జనవరి 2021
International - Dec 15, 2020 , 02:48:26

అమెరికాపై సైబర్‌ దాడి

అమెరికాపై సైబర్‌ దాడి

ట్రెజరీ, వాణిజ్య శాఖలపై దాడులు 

ధ్రువీకరించిన అధికారులు.. రష్యాపై అనుమానం

వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యంత అధునాతన సాంకేతిక వ్యవస్థ కలిగిన అమెరికా ప్రభుత్వ సంస్థలపై సైబర్‌ దాడి జరిగింది. అమెరికా ట్రెజరీ, వాణిజ్య శాఖలోని ఓ విభాగంపై సైబర్‌ దాడి జరిగినట్టు అక్కడి అధికారులు ఆదివారం వెల్లడించారు. ‘అమెరికా ప్రభుత్వానికి చెందిన రెండు శాఖలపై సైబర్‌ దాడి జరిగినట్టు వస్తున్న వార్తలు నిజమే. దాడులకు పాల్పడిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటాం’ అని నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌సీ) ప్రతినిధి జాన్‌ ఉల్యోట్‌ తెలిపారు. ఈ దాడుల వెనుక రష్యా ఫారెన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎస్‌వీఆర్‌) కోసం పనిచేసే ‘కోజీ బేర్‌' అనే సైబర్‌ గ్రూప్‌ (రష్యాకు చెందినది) ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ట్రెజరీ, వాణిజ్య శాఖలోని సిబ్బంది మెయిల్స్‌ను దుండగులు గత కొన్ని నెలలుగా దొంగచాటుగా చదువుతున్నారని ‘న్యూయార్క్‌ టైమ్స్‌' ఓ కథనంలో పేర్కొంది. అమెరికా సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ‘ఫైర్‌ఐ’ మీద ఇటీవల సైబర్‌ దాడులకు పాల్పడిన హ్యాకర్లే తాజా దాడులకు పాల్పడి ఉండవచ్చని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌' వెల్లడించింది. ‘సోలార్‌ విండ్‌ నెట్‌వర్క్‌ మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఓరియన్‌' నెట్‌వర్క్‌ ద్వారానే హ్యాకర్లు ఈ దాడులకు పాల్పడినట్టు ‘ఫైర్‌ఐ’ అభిప్రాయపడింది.  


logo