శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 02:07:03

మాకొద్దు బాబోయ్‌!

మాకొద్దు బాబోయ్‌!

  • స్పుత్నిక్‌-వీ టీకాపై రష్యాలోనే వైద్యుల విముఖత 
  • వ్యాక్సిన్‌ సమర్థతపై అనుమానాలు
  • ఆగమాగంగా తయారీపై సందేహాలు 
  • ఆన్‌లైన్‌ సర్వేలో వెల్లడి 

మాస్కో: కరోనా చికిత్సకు రష్యా తీసుకొచ్చిన టీకాను ఆ దేశ వైద్యులే నమ్మడంలేదు. ‘స్పుత్నిక్‌-వీ’ వ్యాక్సిన్‌ను వేయించుకోవడానికి రష్యాకు చెందిన ప్రతి ఇద్దరి వైద్యుల్లో ఒకరు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మూడు వేల మంది వైద్యులపై ‘డాక్టర్స్‌ హ్యాండ్‌బుక్‌' యాప్‌ చేసిన ఓ ఆన్‌లైన్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ వివరాలను ‘ఆర్బీసీ’ న్యూస్‌ వెబ్‌సైట్‌ ప్రచురించింది. సర్వే ప్రకారం.. కేవలం 24 శాతం మంది వైద్యులు మాత్రమే స్పుత్నిక్‌-వీ టీకాను వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 52 శాతం మంది టీకాను వేయించుకోబోమని తేల్చి చెప్పారు. తాము టీకాను వేయించుకోకపోయినప్పటికీ, రోగులు, సహచర వైద్యులు, స్నేహితులకు టీకాను సిఫారసు చేస్తామని 20 శాతం మంది చెప్పారు. వ్యాక్సిన్‌ సమర్థతను తెలియజేసే తగిన సమాచారం అందుబాటులో లేదని 66 శాతం మంది పేర్కొనగా, ఆదరబాదరగా చాలావేగంగా ఈ టీకాను అభివృద్ధి చేశారని 48 శాతం మంది వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ సర్వేపై రష్యా ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఓలెగ్‌ సలాగే స్పందించారు. ఏండ్లకు ఏండ్లు పరిశోధనలు సాగించి అభివృద్ధి చేసిన టీకాను నమ్మడం సాధారణ విషయమేనని, అయితే టీకా సురక్షితత్వం, సామర్థ్యాన్ని అంచనా వేసి అధికారికంగా ప్రకటన చేశాక కూడా నమ్మకపోవడం సరైందికాదని ఆయన పేర్కొన్నారు. 

మూడోదశ ట్రయల్స్‌కు వేలాదిమంది 

మరో వారం, పది రోజుల్లో ప్రారంభంకానున్న స్పుత్నిక్‌-వీ మూడో దశ ట్రయల్స్‌ కోసం వేలాది మంది ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ‘టాస్‌ న్యూస్‌' ఏజెన్సీ వెల్లడించింది. మరోవైపు, వ్యాక్సిన్‌ తయారీలో ప్రమాణాలు పాటించలేదని నిరసిస్తూ రష్యా ఆరోగ్యశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు అలెగ్జాండర్‌ చుచాలిన్‌ తన పదవికి రాజీనామా చేస్తూ వైద్య ప్రమాణాల కమిటీ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.

నోబెల్‌ గ్రహీత అనుమానాలు

సిడ్నీ: ‘స్పుత్నిక్‌-వీ’ టీకాపై ఆస్ట్రేలియా వైద్య నిపుణుడు, నోబెల్‌ గ్రహీత పీటర్‌ చార్లెస్‌ డోహెర్టీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 కట్టడికి ఈ టీకా సురక్షితమైనది కాదని నిరూపణ అయితే, ఆ ప్రభావం మిగతా వ్యాక్సిన్‌ల అనుమతులపై పడే అవకాశమున్నదని అన్నారు. ‘రష్యా టీకా సురక్షితం కాదని రుజువైతే ఇతర వ్యాక్సిన్‌లను నిరాకరించే ప్రమాదమున్నది. కొవిడ్‌-19పై ‘స్పుత్నిక్‌-వీ’ సమర్థవంతంగా పనిచేస్తుందా? అన్నదే అసలైన సమస్య’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తక్కువ వ్యయంతో ఔషధాలను, వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడంలో భారత్‌కు మంచి అనుభవం ఉన్నదని, కరోనా నేపథ్యంలో టీకా ఉత్పత్తిలో భారత్‌ ప్రధాన భూమిక పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 


logo