గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 13, 2020 , 18:57:54

రేపు రష్యా అంతటికీ స్పుత్నిక్‌ వీ టీకాలు..!

రేపు రష్యా అంతటికీ స్పుత్నిక్‌ వీ టీకాలు..!

మాస్కో: ప్రపంచంలోనే మొదటి కొవిడ్‌ టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా దాన్ని దేశమంతటా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం (సెప్టెంబర్ 14) నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు స్పుత్నిక్‌ వీ మొదటి బ్యాచ్‌ అందజేసే అవకాశముందని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో విలేకరులకు చెప్పారు. సరఫరా విధానాన్ని పరీక్షించేందుకు టీకా మొదటి బ్యాచ్‌ను ఇప్పటికే తరలించామన్నారు. ప్రస్తుతం సరఫరా వ్యవస్థను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా తమ సిబ్బందికి దీనిపై అవగాహన వస్తుందన్నారు. తక్కువ మొత్తంలో మొదటి బ్యాచ్‌ టీకాలు ఇప్పటికే అన్ని ప్రాంతాలకూ చేరుకున్నాయని, లెనిన్‌గ్రాడ్‌ ప్రాంతానికి కూడా ఈ దశలోనే వ్యాక్సిన్‌ పంపిస్తున్నట్లు చెప్పారు. సోమవారం రోజే టీకాలు పంపిణీ కూడా చేస్తామని మురాష్కో వెల్లడించారు. 

రష్యా తమ టీకా స్పుత్నిక్‌ వీని ప్రజలకు పంపిణీ చేసేందుకు విడుదల చేసిన వారం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌  ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇచ్చేందుకు రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దేశంలో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దేశంలోని 40,000 మందికి టీకా ఇవ్వనున్నారు. 2020-21లో ఒక బిలియన్ మందికి పైగా తమ టీకాను తీసుకుంటారని రష్యన్‌ డైరెక్టరేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఐఎఫ్‌) తెలిపింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo