శనివారం 08 ఆగస్టు 2020
International - Aug 02, 2020 , 00:47:42

రైళ్లలో కరోనా వ్యాప్తి ఇలా

రైళ్లలో కరోనా వ్యాప్తి ఇలా

  • ఎంతదూరంలో వ్యాప్తి, ఏ మేరకు ముప్పు   
  • శాస్త్రవేత్తల పరిశోధన 

లండన్‌: కరోనా నేపథ్యంలో రైళ్లు వంటి ప్రజారవాణా సేవలను పలుదేశాలు కొంతకాలంపాటు నిలిపివేసినప్పటికీ.. మనదేశంలోలాగే మళ్లీ పరిమితస్థాయిలో ప్రారంభించాయి. కరోనా బాధితులు కూడా రైళ్లలో ప్రయాణించే అవకాశాలు లేకపోలేదు. అటువంటి వారి నుంచి ఇతర ప్రయాణికులకు ఎటువంటి ముప్పు ఉంటుంది? కరోనా వైరస్‌ వారికి సోకే ప్రమాదం ఏ మేరకు ఉంటుంది? అన్నదానిపై చైనాలోని ‘వ్యాధి నియంత్రణ, నిరోధక కేంద్రం’, బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌథాంప్టన్‌ శాస్త్రవేత్తలు కలిసి చైనాలోని హైస్పీడ్‌ రైళ్లలో ఒక పరిశోధన చేశారు. దీనిద్వారా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి వీలువుతుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఇలా ఉన్నాయి..

  • కరోనా సోకిన వ్యక్తికి సమీపంలో నిలువుగా ఐదు వరుసల్లో (సీట్లలో), అడ్డుగా మూడు వరుసల్లో (సీట్లలో) కూర్చునే వారికి వైరస్‌ సోకే ప్రమాదం సున్నా నుంచి 10 శాతం వరకూ ఉంటుంది. సగటున అందరికీ 0.32 శాతం అవకాశం ఉంటుంది.
  • రోగి పక్క సీట్లోనే కూర్చునే వ్యక్తికి వైరస్‌ సోకే ప్రమాదం 3.5 శాతం వరకు ఉంటుంది. పక్కన కాకపోయినా అదే వరుసలో (బెర్తులో) కూర్చునే వారికి వైరస్‌ ప్రమాదం 1.5 శాతం.
  • కరోనారోగితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఒక గంట ప్రయాణమైతే భౌతికదూరం ఒక మీటరు సరిపోతుంది. కానీ, రెండు గంటల ప్రయాణమైతే 2.5 మీటర్ల కన్నా ఎక్కువ భౌతికదూరం పాటించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది.
  • అంతకుముందు కరోనా రోగి కూర్చున్న సీటులో కూర్చొని ప్రయాణం చేసే వారికి వైరస్‌ సోకే అవకాశం 0.075 శాతం మాత్రమే.


logo