శుక్రవారం 03 జూలై 2020
International - Jun 13, 2020 , 11:15:59

కోవిడ్‌19తో నాడీ వ్యవస్థ కుదేలు.. పరిశోధకుల వెల్లడి

కోవిడ్‌19తో నాడీ వ్యవస్థ కుదేలు.. పరిశోధకుల వెల్లడి

హైదరాబాద్‌:  కోవిడ్‌19 వచ్చే నరాల సంబంధిత రోగాలపై నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ తాజాగా అధ్యయనం చేసింది. కోవిడ్‌ సోకిన వారిలో కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆ వర్సిటీ తన స్టడీలో పేర్కొన్నది. ఈ విషయాన్ని ఆ వర్సిటీ తన వెబ్‌సైట్‌లోనూ పోస్టు చేసింది. హాస్పిటల్‌లో చేరిన సగం మంది పేషెంట్లలో.. కోవిడ్‌19 వల్ల నరాల సంబంధిత లోపాలు తలెత్తినట్లు గుర్తించారు. తలనొప్పి, నలత, చురుకుదనం తగ్గడం, ఏకాగ్రత లోపించడం, వాసన, రుచి గుర్తించకపోవడం, గుండెపోటు, బలహీనత, వొళ్లు నొప్పులు లాంటి లక్షణాలను గుర్తించినట్లు ఆ స్టడీలో ప్కేన్నారు. 

కేంద్ర నాడీ వ్యవస్థకు చెందిన మెదడు, వెన్నుపూస, నరాలు, కండరాలను కూడా కరోనా వైరస్‌ దెబ్బతీస్తుందన్నారు. కోవిడ్19 వ్యాధి శరీరంలో చాలా వరకు అవయవాలపై ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె, మెదడు లాంటి అవయవాలకు కూడా ఆక్సిజన్‌ అందని పరిస్థితి ఏర్పడుతుందని స్టడీలో తెలిపారు. ఆక్సిజన్‌ సరిగా సరఫరా లేని కారణంగా ఆ అవయవాలు స్తంభించిపోయే ప్రమాదం ఉందన్నారు. వైరస్‌ నేరుగా మెదడుకు సోకుందని, దీంతో మెదడువాపు లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల మెదడు, ఇతర నరాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. 

జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడానికి ముందు.. సార్స్‌ సీఓవీ2 వైరస్‌ వల్ల నాడీ రుగ్మతలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని నార్త్‌వెస్ట్రన్‌ పరిశోధనా బృందం రచయిత ఇగర్‌ కోరాల్నిక్‌ తెలిపారు.  కోరాల్నిక్‌తో పాటు అతని బృందం.. కరోనా పేషెంట్లపై న్యూరో కోవిడ్‌ రీసర్చ్‌ చేపట్టింది.న్యూరాలజీ మ్యాగ్జిన్‌లో ఈ వారం ఈ విషయాన్ని పబ్లిష్‌ చేశారు. షికాగోలోని నార్త్‌వెస్ట్రన్‌ మెమోరియల్‌ హెల్త్‌కేర్‌ వర్సిటీ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగింది.


logo