బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 15:46:05

పది లక్షలకు చేరువలో కరోనా మరణాలు..!

పది లక్షలకు చేరువలో కరోనా మరణాలు..!

న్యూఢిల్లీ: గతేడాది చైనా నుంచి వ్యాప్తి చెంది ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకున్నది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య ఆదివారం నాటికి పది లక్షల మార్కుకు చేరువకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ మహమ్మారి వల్ల 9,98,721 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 లక్షల కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 7,065,019 కేసులు, 2,04,249 మరణాలతో యూఎస్‌ఏ మొదటిస్థానంలో ఉంది. ఇది ప్రపంచ మరణాల సంఖ్యలో 20 శాతానికిపైగా ఉండడం ఆ దేశాన్ని కలవరపెడుతోంది.

కొవిడ్‌ మరణాల సంఖ్యలో ప్రపంచంలోనే రెండోస్థానంలో బ్రెజిల్‌ ఉంది. అక్కడ ఇప్పటివరకూ 1,40,537 మరణాలు సంభవించాయి. భారత్ మూడో స్థానంలో ఉంది. 30,000 మరణాలకు పైగా మరణాలు సంభవించిన దేశాలలో మెక్సికో, బ్రిటన్, ఇటలీ, పెరూ, ఫ్రాన్స్, స్పెయిన్ ఉన్నాయి.

అత్యధిక కేసులున్న దేశాలు..

కేసులు అత్యధికంగా ఉన్న ఇతర టాప్ 15 దేశాలు ఇవే.  బ్రెజిల్ (47,17,991), రష్యా (11,38,509), కొలంబియా (8,06,038), పెరూ (7,94,584), మెక్సికో (7,26,431), స్పెయిన్ (7,16,481), అర్జెంటీనా (7,02,484), దక్షిణాఫ్రికా (6,69,498), ఫ్రాన్స్ (5,52,454), చిలీ (4,55,979), ఇరాన్ (4,43,086), యూకే (4,31,816), బంగ్లాదేశ్ (3,57,873), ఇరాక్ (3,45,969), సౌదీ అరేబియా (3,32,790). ఈ వివరాలను యూనివర్సిటీ సెంటర్‌ ఫర్ సిస్టమ్స్‌ సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఎస్‌ఈ) వెల్లడించింది.  

పదిశాతం మరణాలు భారత్‌లోనే..

గ్లోబల్‌ కొవిడ్‌ -19 మరణాలలో దాదాపు 10 శాతం భారతదేశంలోనే సంభవించాయి. శనివారం 1,089 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 93,379కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొత్తం కేసులు 59,03,933 గా ఉన్నాయి, వీటిలో 9,60,969 క్రియాశీల కేసులుండగా, 48,49,585 మంది కొవిడ్‌నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో యాక్టివ్ కొవిడ్ -19 కేసులు 2,73,190 ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (98,493), ఆంధ్రప్రదేశ్ (67,683), ఉత్తర ప్రదేశ్ (59,397), తమిళనాడు (46,386) ఉన్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo