గురువారం 04 జూన్ 2020
International - May 17, 2020 , 18:36:46

కరోనా సోకిందా? ఇక జీవితాంతం పరీక్షలు తప్పవు

కరోనా సోకిందా? ఇక జీవితాంతం పరీక్షలు తప్పవు

బీజింగ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న చైనా.. అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ తమ దేశ ప్రజలకు సూచిస్తూనే ఉన్నది. కరోనా వైరస్‌ సోకి చికిత్స పొందినవారు అనంతరం కూడా వివిధ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలంటూ చైనాకు చెందిన నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వైరస్‌ బారినపడినవారు భవిష్యత్‌లో అంతర్గత అవయవాల సమస్యలు ఎదుర్కొంటారని.. వీరిలో కాలేయం, గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరించింది. అదేవిధంగా కండరాల క్షీణతతోపాటు మానసిక సమస్యలు కూడా వెంటాడుతాయని ఎన్‌హెచ్‌సీ పేర్కొన్నది. 

చాలా మంది రోగులు ముఖ్యంగా తేలికపాటి లక్షణాలు కలిగివుండి చికిత్స పొందినవారిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కనిపించకపోవచ్చునని, అయితే, తీవ్రమైన లక్షణాలతో బయటపడినవారిలో మాత్రం అవయవ నష్టం కలుగుతుందని చైనా యొక్క నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. వీరి పునరావాసం కొరకు ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరమున్నదని సూచించింది. కొందరిలో ఆంజినా, అరిథ్మియా వంటి గుండె సమస్యలు కూడా బయటపడుతాయిని తెలిపింది. ఇక మానసిక ఆరోగ్య సమస్యల్లో నిరాశ, నిద్రలేమి, తినే రుగ్మతలు వంటి మార్పులు కనిపిస్తాయని వెల్లడించింది. జనవరి 23 నుంచి శనివారం వరకు చైనావ్యాప్తంగా 78,227 మంది వ్యాధిగ్రస్థులు చికిత్స పొంది సురక్షితంగా డిశ్చార్జి అవగా, 4,634 మంది కన్నుమూశారు. వుహాన్‌ పట్టణంలో గత డిసెంబర్‌ నెలలో వెలుగుచూసిన తొలి కరోనా పాజిటివ్‌ కేసు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40.6 లక్షల మంది కరోనా వైరస్‌కు గురవగా.. ఇప్పటివరకు 3,12,000 మంది చనిపోయారు. 


logo