సోమవారం 06 జూలై 2020
International - Jun 09, 2020 , 03:28:00

కరోనాపై అస్త్రం కోసం..కాలంతో పోటీ!

కరోనాపై అస్త్రం కోసం..కాలంతో పోటీ!

  • వ్యాక్సిన్‌ కోసం శ్రమిస్తున్న దేశాలు, సంస్థలు 
  • ఏకకాలంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఉత్పత్తి కూడా  
  • తక్కువ సమయంలో అందుబాటులోకి..

న్యూయార్క్‌/లండన్‌: కరోనా విశ్వమారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో పలు దేశాలు, సంస్థలు నిమగ్నమయ్యాయి. వ్యాక్సిన్‌ సత్ఫలితాల్ని ఇస్తే సరఫరా ఆలస్యం కాకూడవన్న ఉద్దేశంతో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్‌ ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటిలో పది వ్యాక్సిన్‌లు క్లినికల్‌ ట్రయల్స్‌ (మానవులపై ఔషధ పరీక్షలు) దశకు చేరుకున్నాయి. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ ‘ఏజెడ్‌డీ 1222 వ్యాక్సిన్‌' ఫలితాలు సెప్టెంబర్‌ నాటికి వస్తాయని నిపుణులు తెలిపారు. మరోవైపు, తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ వచ్చేనెలలో క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోకి వెళ్లనున్నట్టు ఆస్ట్రేలియా వెల్లడించింది.

200 కోట్ల డోసులు ఉత్పత్తి

వచ్చే సెప్టెంబర్‌నాటికి ‘ఏజెడ్‌డీ 1222’ వ్యాక్సిన్‌ను దాదాపు 200 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని తయారీదారు సంస్థ ‘ఆస్ట్రాజెనెకా’ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో తాము జరుపుతున్న వ్యాక్సిన్‌ పరిశోధనలు సక్రమంగా జరుగుతున్నాయని, ఇప్పటికే వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించామని సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌  పాస్కల్‌ సోరియెట్‌ తెలిపారు. ఆగస్టు చివరినాటికి వ్యాక్సిన్‌పై ట్రయల్స్‌ పూర్తవుతాయని, సెప్టెంబర్‌నాటికి వ్యాక్సిన్‌ ఫలితంపై స్పష్టత వస్తుందన్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

వచ్చేనెలలో మనుషులపై వ్యాక్సిన్‌ పరీక్షలు

ఆస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్‌ల్యాండ్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ వచ్చేనెల క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు వెళ్లనున్నది. తొలుత 120 మందిపై ఈ ప్రయోగాలను చేయనున్నట్టు పరిశోధకుడు పాల్‌ యంగ్‌ వెల్లడించారు. తొలిదశలో వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలను ఇస్తే.. ఆ తర్వాత వెయ్యి మందిపై ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ‘మాలిక్యులర్‌  క్లాంప్‌ టెక్నాలజీ’ సాయంతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌.. వచ్చే ఏడాది చివరినాటికి అందుబాటులోకి రావచ్చని పరిశోధకులు తెలిపారు. ప్రాథమికంగా 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి కోసం ఫార్మా కంపెనీ ‘సీఎస్‌ఎల్‌'తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించారు.

ఒలింపిక్స్‌ కంటే ముందే..

జపాన్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థలు షియోనోగీ, యాంజెస్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది జూన్‌నాటికి అందుబాటులోకి రావొచ్చని జపాన్‌ ఆరోగ్య మంత్రి కట్సునోబు కాటో తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌ కంటే ముందే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశమున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఏకకాలంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీని చేపట్టినట్టు వెల్లడించారు. దీనికోసం 134 కోట్ల డాలర్లను కేటాయించినట్టు పేర్కొన్నారు.  

నాణ్యమైన ఉత్పత్తి కోసం..

తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై ఇటీవలే క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలు పెట్టామని సింగపూర్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ వ్యాక్సిన్‌ సత్ఫలితాల్ని ఇస్తే సరఫరా ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో ఉత్పత్తిని కూడా ప్రారంభించామని వెల్లడించింది. వ్యాక్సిన్‌ తయారీని ముందుగా ప్రారంభిస్తే ఉత్పత్తిలో నాణ్యత, వేగం మరింత పెరుగుతుందని ఆ దేశ ప్రధాని లీ సెయిన్‌ లూంగ్‌ తెలిపారు. కాగా కరోనా నిర్ధారణ కోసం సింగపూర్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సెరోలాజికల్‌, న్యూక్లియిక్‌ యాసిడ్‌ ఆధారిత పరీక్షల్ని 20కి పైగా దేశాల్లో వినియోగిస్తున్నారు. 

20 లక్షల డోసులు సిద్ధం

‘కరోనా రోగులకు ఇచ్చేందుకు ఇప్పటికే 20 లక్షల వ్యాక్సిన్‌ డోసులు సిద్ధంగా ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్‌ సమర్ధత, పనితీరు, రక్షణ తదితర అంశాలపై శాస్త్రవేత్తలు ప్రకటన చేయాల్సి ఉన్నది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. అయితే, ఏ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఉద్దేశించి ఆయన ఈ ప్రకటన చేశారో వివరించలేదు. కాగా అమెరికాలో ప్రధానంగా ఐదు సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. అవి మాడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫిజర్‌, మెర్క్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌.


logo