శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 18:34:11

కార్టికోస్టెరాయిడ్స్‌తో కొవిడ్‌ మరణాల రేటులో తగ్గుదల..!

కార్టికోస్టెరాయిడ్స్‌తో కొవిడ్‌ మరణాల రేటులో తగ్గుదల..!

న్యూ ఢిల్లీ: కొవిడ్‌-19కు ఇప్పటివరకూ కచ్చితమైన చికిత్స లేదు. కానీ కొన్ని స్టెరాయిడ్స్‌ వాడకం వల్ల తీవ్రస్థాయిలో ఇన్‌ఫెక్ట్‌ అయిన వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఏడు అంతర్జాతీయ ట్రయల్స్ మెటా-విశ్లేషణలో కొవిడ్‌-19 చికిత్సగా కార్టికోస్టెరాయిడ్ డ్రగ్స్‌ను ఉపయోగించడం వలన కరోనావైరస్ సంక్రమణతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులలో మరణాల రేటును 20 శాతం వరకు తగ్గించవచ్చని తేలింది. ఈ ఫలితాల ఆధారంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొవిడ్‌-19 చికిత్సకు తన మార్గదర్శకాలను అప్‌డేట్‌ చేసింది.   

కొవిడ్‌-19 రోగులకు సమర్థవంతమైన చికిత్సలు అత్యవసరంగా అవసరం అయినప్పటికీ  కార్టికోస్టెరాయిడ్స్ పాత్ర నిరంతర వివాదంగా ఉంది. కాగా, జూన్‌లో స్టెరాయిడ్ వాడకంపై నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు తాజాగా జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేష‌న్‌లో ప్రచురితమయ్యాయి. తక్కువ మోతాదు డెక్సామెథాసోన్ కొవిడ్‌-19తో బాధపడుతూ దవాఖానలో వెంటిలేటర్‌పై ఉన్న రోగులలో మరణాలను తగ్గించిందని తేలింది. అప్పటి నుంచి డెక్సామెథాసోన్‌ను ఉపయోగిస్తున్నారు. కొన్ని దేశాలలో ఇంటెన్సివ్ కొవిడ్‌-19 కేర్ వార్డులలో విస్తృతంగా వాడుకలో ఉంది.

ప్రభావవంతంగా పనిచేశాయి..

కార్టికోస్టెరాయిడ్స్ తీవ్ర అనారోగ్యంతో ఉన్న కొవిడ్‌-19 రోగులలో మరణాలను తగ్గించాయి. తీవ్రమైన అనారోగ్య కొవిడ్‌-19 రోగులలో స్టెరాయిడ్ డ్రగ్‌ వినియోగం, మరణాల మధ్య సంబంధాన్ని అంచనా వేసేందుకు 1, 703 మందిని పరిశోధకులు ఎంచుకున్నారు.  ఏడు రాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 678 మందికి డెక్సామెథాసోన్, హైడ్రోకార్టిసోన్, లేదా మిథైల్ప్రెడ్నిసోలోన్‌ను ర్యాండమ్‌గా ఇచ్చారు. 1025 మంది రోగులకు సాధారణ చికిత్స అందించారు. 

కాగా,  కార్టికోస్టెరాయిడ్స్ తీసుకున్న 678 మంది రోగులలో 222 మరణాలు అంటే 32.7 శాతం సంభవిస్తే, సాధారణ చికిత్స తీసుకున్న1025 మంది రోగులలో 425 మరణాలు అంటే 41.5 శాతం మరణాలు నమోదైనట్లు గుర్తించారు. కాగా, ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను ఆధారంగా చేసుకుని తీవ్రమైన కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ ఉన్న రోగులకు చికిత్సలో స్టెరాయిడ్స్‌ వాడాలని తమ మార్గదర్శకాల్లో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో క్లినికల్ కేర్ లీడ్ జానెట్ డియాజ్ తెలిపారు. కాగా, స్టెరాయిడ్స్ నివారణ కాదు, కానీ అవి ఫలితాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని హైడ్రోకార్టిసోన్‌పై పరిశోధనలకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఆంథోనీ గోర్డాన్ అన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo