బుధవారం 03 జూన్ 2020
International - May 07, 2020 , 09:01:42

పెర‌ల్ హార్బ‌ర్ దాడి క‌న్నా దారుణం..

పెర‌ల్ హార్బ‌ర్ దాడి క‌న్నా దారుణం..

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల దేశంలో పెరుగుతున్న మృతుల సంఖ్య‌పై అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు.  1941లో అమెరికాపై జ‌రిగిన పెర‌ల్ హార్బ‌ర్ దాడి క‌న్నా.. ఈ మ‌ర‌ణాల రేటు దారుణంగా ఉంద‌న్నారు.  త‌మ దేశంపై వైర‌స్‌తో చైనాయే దాడి చేసింద‌న్న అనుమానాల‌ను ఆయ‌న మ‌రోసారి లేవ‌నెత్తారు.  వైర‌స్‌ను నియంత్రించ‌లేక‌పోయిన చైనాపై న‌ష్ట‌ప‌రిహార దావా వేసేందుకు ఆలోచిస్తున్న‌ట్లు ట్రంప్ చెప్పారు. వైర‌స్ ఎక్క‌డ పుట్టిందో అక్క‌డే నియంత్రించాల్సి ఉంద‌ని, చైనాలోనే వైర‌స్‌ను నియంత్రించి ఉంటే ఇంత‌ న‌ష్టం జ‌రిగేది  కాద‌న్నారు. మ‌హ‌మ్మారిని ఓ యుద్ధంలా చూస్తున్నారా అని ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు ట్రంప్ బ‌దులిస్తూ.. మ‌హ‌మ్మారిని అమెరికా శుత్ర‌వుగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. క‌నిపించ‌కుండా విధ్వంసం సృష్టిస్తున్న వైర‌స్‌ను శ‌త్రువుగా భావిస్తున్నాన‌ని, ఆ వైర‌స్ ఇక్క‌డ‌కు రావ‌డం న‌చ్చడం లేద‌ని, కానీ ఆ క‌నిపించ‌ని శ‌త్రువును ఓ యుద్ధంలా చూస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.

హ‌వాయిలో ఉన్న పెర‌ల్ హార్బ‌ర్‌పై జ‌పాన్ ఆక‌స్మిక దాడి చేయ‌డంతో.. అమెరికా రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో పాల్గొనాల్సి వ‌చ్చింది. అయితే ఆ ఘ‌ట‌న‌ను ట్రంప్ గుర్తు చేశారు. ఇది పెర‌ల్‌హార్బ‌ర్ క‌న్నా ఘోరంగా ఉంది, వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న క‌న్నా దారుణంగా ఉంద‌ని ట్రంప్ అన్నారు. అస‌లు ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గాల్సింది కాద‌న్నారు.  వైట్‌హౌజ్‌లో రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.  2001లో సెప్టెంబ‌ర్ 11వ తేదీన ఉగ్ర‌వాదులు వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై విమానాల‌తో దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌లో సుమారు మూడు వేల మంది మ‌ర‌ణించారు. కానీ ప్ర‌స్తుతం నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 60 వేలు దాటింది. logo