సోమవారం 19 అక్టోబర్ 2020
International - Oct 06, 2020 , 18:33:27

2022 నాటికి ప్రపంచంలో 70% మందికి కరోనా వ్యాక్సిన్

2022 నాటికి ప్రపంచంలో 70% మందికి కరోనా వ్యాక్సిన్

న్యూఢిల్లీ : రానున్న రెండేండ్లలో ప్రపంచ జనాభాలోని 70 శాతం మందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ధ్రువీకరించారు. ప్రపంచంలో 60-70 శాతం మందికి కరోనా టీకాలు వేయడానికి మరో రెండేండ్ల సమయం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 క్లినికల్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని, వాటిలో తొమ్మిది 2వ దశ, 3 వ దశలో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ చెప్పారు. వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలో ఉన్న కంపెనీలు ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఫలితాలను ప్రచురించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. “కనీసం 60 శాతం నుంచి 70 శాతం వరకు కవర్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశిస్తే అన్ని దేశాల జనాభాకు 2022 ముగిసేలోపు జరుగదు”అని ఆమె అన్నారు.

కొవిడ్ వ్యాక్సిన్లు భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నప్పుడు తక్కువ డాలర్లకు లభిస్తాయని తాను నమ్ముతున్నానని స్వామినాథన్ చెప్పారు. రానున్న శీతాకాలాలు కరోనా వైరస్ నుంచి  ప్రమాదాన్ని పెంచుతాయన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, నిర్ణీత దూరం ఉండటం సాధన చేయాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పేలవమైన వెంటిలేషన్ సెట్టింగుల్లో రద్దీగా ఉండే సమావేశాలకు దూరంగా ఉండాలని ఆమె ప్రజలకు సూచించారు. అయితే, ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని తెలుస్తున్నది. గత ఆగస్టు నుంచి దేశంలో అత్యల్ప రోజువారీ కేసులు మంగళవారం నాడు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 900 కంటే తక్కువగా ఉండటం సంతోషించదగిన విషయం. భారతదేశంలో నిపుణులు దేశం గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు ఇంకా ధ్రువీకరించనప్పటికీ.. కేసులు తగ్గడం వల్ల వారు ఆశాజనకంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. రానున్న రెండు వారాల వరకు తగ్గుతున్న కేసుల ధోరణి ఇలాగే కొనసాగితే.. భారతదేశం గరిష్ఠ స్థాయిని దాటిందని చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు.


logo