బుధవారం 03 జూన్ 2020
International - Apr 07, 2020 , 02:27:01

లాక్‌డౌన్‌తో చెక్‌ పెట్టారు

లాక్‌డౌన్‌తో చెక్‌ పెట్టారు

  • వుహాన్‌, సింగపూర్‌ అనుభవపాఠమిదే 

బీజింగ్‌/సింగపూర్‌: ప్రపంచ దేశాల్ని అల్లాడిస్తున్న కరోనా విశ్వమారిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ ఓ పాశుపతాస్త్రంలా పనిచేస్తున్నది. కరోనా వైరస్‌ వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌ నగరం, సింగపూర్‌ అనుభవాలు దీనిని నిరూపిస్తున్నాయి.

ఆంక్షల కొనసాగింపుకు మొగ్గు 

గత డిసెంబర్‌ చివర్లో వెలుగుచూసిన కరోనాతో చైనాలోని ఒక కోటి జనాభా గల వుహాన్‌ నగరం ఉలిక్కి పడింది. ఆలస్యంగానైనా మేల్కొన్న యంత్రాంగం నగరవ్యాప్తంగా జనవరి 23న లాక్‌డౌన్‌ విధించింది. ఫలితంగా మార్చి చివరినాటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. అప్పటికే నమోదైన 50 వేల కేసులకు కొత్త కేసులు పెద్దగా జతకూడలేదు. ఈ 50 వేల మందిలో 47 వేల మందిని కోలుకునేలా చేయగలిగారు. ఈ బుధవారం నగరవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని భావిస్తున్నప్పటికీ, ఇంకా 574 మందికి కరోనా పాజిటివ్‌ ఉండ టం తో కొన్ని ఆంక్షల్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

అది చేయాల్సిందే

అది మార్చి 21. దాదాపు 170 దేశాలు అతలాకుతలం అవుతున్న సమయం. సింగపూర్‌ మాత్రం ధైర్యంగా ఉన్నది. దేశంలో అప్పటికే 385 పాజిటివ్‌ కేసులు నమోదైనప్పటికీ జంకు లేదు. సరిహద్దులు, భూ, వాయు, జల మార్గాల్ని అ దేశం అప్పటికే మూసేసింది. అయితే, ఆ సాయంత్రమే మొదటి కరోనా మరణం నమోదైంది. క్రమంగా రోజుకు సగటున 60 కొత్త కేసుల చొప్పున మొత్తం 1375 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. సరిహద్దుల్ని మూసివేసినంత మాత్రాన ఈ మహమ్మారిని కట్టడి చేయలేమని నిర్ధారించుకున్న ఆ దేశ ప్రధాని లీ లూంగ్‌.. ఏప్రిల్‌ 3 నుంచి ఒక నెలపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఇదే అత్యుత్తమ విధానమని ఆయన వ్యాఖ్యానించారు.


logo