గురువారం 02 జూలై 2020
International - Jun 09, 2020 , 09:20:53

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న కరోనా కేసులు: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న కరోనా కేసులు: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ హెచ్చరించారు. ఆదివారం (జూన్‌ 7న) ఒక్కరోజే ప్రపంచంలో 1,36,000 కరోనా కేసులు పెరిగినట్లు వెల్లడించారు. ఇందులో అమెరికా, దక్షిణాసియాలోని పది దేశాల్లోనే 75 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు. గత తొమ్మిది రోజుల్లో లక్ష మందికి వైరస్‌ సోకినట్లు తెలిపారు. ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. 

గతేడాది డిసెంబర్‌లో చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్‌ ఇప్పటివరకు 4,03,000 మందిని పొట్టనపెట్టుకుందని, 70 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. చైనా తర్వాత తూర్పు ఆసియా కరోనాకు కేంద్రంగా మారిందని, అనంతరం అది యూరప్‌ ఖండానికి విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం కరోనాకు ప్రధాన కేంద్రంగా ఉన్న అమెరికా వాటిని అధిగమించిందని తెలిపారు. అమెరికాలో జరుగుతున్న జాతివ్యతిరేక ఆందోళనలతో వైరస్‌ మరింతగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. 

కొన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నదని, మరికొన్ని దేశాల్లో కేసుల సంఖ్య వెయ్యిలోపే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, అయితే నిర్లక్ష్యమే వారికి ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇది మరింత దిగజారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.


logo