సోమవారం 30 మార్చి 2020
International - Feb 20, 2020 , 02:09:13

‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నుంచి విముక్తి!

‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నుంచి విముక్తి!
  • కరోనా ‘నెగెటివ్‌' రావడంతో 500 మంది విడుదల
  • మరో భారతీయుడికి వైరస్‌
  • చైనాలో రెండువేలు దాటిన మృతులు

యొకోహమా, ఫిబ్రవరి 19: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) భయాందోళనల నేపథ్యంలో జపాన్‌ తీరంలో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నౌకలోని 500 మందికి ఎట్టకేలకు విముక్తి లభించింది. వైద్య పరీక్షల్లో ‘నెగెటివ్‌' వచ్చినవారిని బయటకు పంపించారు. 14 రోజులుగా వీరు నౌకలోనే ఉన్న సంగతి తెలిసిందే. పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నందున మిగిలిన వారిని ఇంకా ఓడలోనే ఉంచారు. నౌకలో మరో భారతీయుడు వైరస్‌ బారిన పడినట్లు భారత రాయబార కార్యాలయం తెలిసింది. ఇప్పటికే ఆరుగురికి వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా వైరస్‌కు 2022నాటికి వ్యాక్సిన్‌ను తయారుచేస్తామని పుణేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) పేర్కొంది. మరో ఆరు నెలల్లో మనుషులపై పరీక్ష దశకు చేరుకుంటుందని తెలిపింది.  

వైద్య సిబ్బందికి మరింత రక్షణ: జిన్‌పింగ్‌

చైనాలో కరోనా మృతుల సంఖ్య బుధవారంనాటికి 2,004కు చేరుకున్నట్లు చైనా జాతీయ వైద్య కమిషన్‌ బుధవారం తెలిపింది. మరో 74,100 మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. కరోనా బారినపడుతున్న వైద్య సిబ్బంది సంఖ్య నానాటికీ పెరుగుతుండడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పందించారు. మహమ్మారిని ఓడించడంలో వైద్య సిబ్బంది వెన్నెముకలాంటివారని, వారి రక్షణకు మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వారిపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపడుతామని, తగిన విశ్రాంతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. హాంకాంగ్‌లో కరోనాకు మరొకరు బలయ్యారు. 


logo