శనివారం 28 నవంబర్ 2020
International - Nov 16, 2020 , 18:42:48

వచ్చే శీతాకాలంనాటికి కరోనా నుంచివిముక్తి!

వచ్చే శీతాకాలంనాటికి కరోనా నుంచివిముక్తి!

లండన్‌: గతేడాది డిసెంబర్‌లో చైనా నుంచి ప్రారంభమైన కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిని ఎదుర్కొనే టీకాల కోసం పరిశోధకులు శ్రమిస్తూనే ఉన్నారు. అయితే, టీకాలు విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి వస్తే వచ్చే శీతాకాలం నాటికి కరోనా నుంచి పూర్తి విముక్తి లభిస్తుందని జర్మనీ సంస్థ బయోఎన్‌ సహవ్యవస్థాపకుడు, టర్కీకి చెందిన శాస్త్రవేత్త ఉగుర్‌ సాహిన్‌ ఓ బ్రిటీష్‌ చానల్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంకా టీకాలు అందుబాటులోకి రానందున ఈ శీతాకాలం పరిస్థితి కొంత క్లిష్టంగానే ఉంటుందని పేర్కొన్నారు. 

బయోఎన్‌ సంస్థ.. యూఎస్ దిగ్గజం ఫైజర్‌తో కలిసి కొవిడ్‌ టీకాను అభివృద్ధి చేస్తున్నది. సాహిన్, అతడి భార్య ఓజ్లెం తురేసి.. 2008 లో పశ్చిమ జర్మనీ నగరమైన మెయిన్జ్‌లో బయోఎన్‌టెక్‌ను స్థాపించారు. ‘అన్నీ సరిగ్గా జరిగితే, మేము ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తాం.’ అని సాహిన్ చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 300 మిలియన్లకుపైగా మోతాదుల టీకాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా కృషిచేస్తున్నామని చెప్పారు. ఎండాకాలంలో కొవిడ్‌ వ్యాప్తి తగ్గిపోతుందని, వచ్చే శీతాకాలం నాటికి అందరికీ టీకాలు అందితే కరోనా కనిపించకుండా పోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అనేక కంపెనీలు టీకా సరఫరాపై దృష్టిసారించాయన్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.