గురువారం 02 ఏప్రిల్ 2020
International - Jan 27, 2020 , 02:27:12

‘కరోనా’ ఉద్ధృతం!

‘కరోనా’ ఉద్ధృతం!
  • చైనాలో 56కు చేరిన మృతులు
  • వైరస్‌ బారిన 1975 మంది
  • అడవి జంతువుల విక్రయంపై చైనా నిషేధం

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌ తీవ్రమవుతున్నది. ఈ వైరస్‌ కారణంగా మృతిచెందినవారి సంఖ్య ఆదివారం నాటికి 56కు చేరుకున్నది. మరో 1,975 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని చైనా జాతీయ హెల్త్‌ కమిషన్‌ అధికారులు వెల్లడించారు. వీరిలో 324 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మరో 2,684 అనుమానిత కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రధానంగా హుబెయి ప్రావిన్స్‌లో వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్నది. వైరస్‌ బారిన పడిన బాధితుల కోసం వుహాన్‌ నగరంలో 10 రోజుల్లో 1,000 పడకల దవాఖాన నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్న చైనా.. దీనికి అదనంగా 1,300 పడకల సామర్థ్యంతో మరో దవాఖానను 15 రోజుల్లోగా నిర్మించాలని నిర్ణయించింది.


కాగా, వుహాన్‌లో అడవి జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్న మార్కెట్‌ నుంచే కరోనా వైరస్‌ వ్యాప్తిచెందినట్లు భావిస్తున్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు అడవి జంతువుల విక్రయంపై చైనా తాత్కాలికంగా నిషేధం విధించింది. అడవి జంతువుల రవాణా, విక్రయాన్ని నిషేధిస్తున్నట్లు ఆదివారం ఆదేశాలు జారీచేసింది. ఈ జంతువుల మాంసం విక్రయం వల్ల వ్యాధికారకాలు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం పెరుగుతున్నదని వైద్య నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. గతంలో ప్రబలిన సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) మూలాలు కూడా అడవి జంతువుల్లో ఉన్నట్లు నిర్ధారించారు. గబ్బిలాల్లో ఉండే ఆ వైరస్‌ అటునుంచి మునుగుపిల్లుల ద్వారా మనుషులకు వ్యాపించినట్లు గుర్తించారు. 


విదేశాల్లోనూ వేగంగా వ్యాప్తి..

విదేశాల్లోనూ కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. ఇప్పటికే హాంకాంగ్‌, మకావ్‌, తైవాన్‌, నేపాల్‌, జపాన్‌, సింగపూర్‌, దక్షిణకొరియా, థాయ్‌లాండ్‌, వియత్నాం, అమెరికా, ఫ్రాన్స్‌కు వైరస్‌ వ్యాపించింది. తాజాగా కెనడాలోనూ ఒకరి వైరస్‌ సోకింది. అమెరికాలో మరొకరు వైరస్‌ బారినపడ్డారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనాలోని వుహాన్‌ నుంచి తమ పౌరులను తరలించనున్నట్లు జపాన్‌ ప్రధాని షింజో అబే ఆదివారం ప్రకటించారు. మరోవైపు, కరోనాపై ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించిన హాంకాంగ్‌.. ఆదివారం డిస్నీల్యాండ్‌ను మూసివేసింది. 


భారతీయులెవరికీ వైరస్‌ సోకలేదు

చైనాలోని భారతీయులెవరికీ వైరస్‌ సోకలేదని విదేశాంగ శాఖ తెలిపింది. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం వుహాన్‌లోని యూనివర్సిటీ విద్యార్థులతో సహా భారతీయులందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపింది. వారిని అక్కడి నుంచి తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నదని వివరించింది. మరోవైపు చైనా నుంచి భారత్‌కు వచ్చి న 29,700 మందికి వైద్యపరీక్షలు నిర్వహిం చామని, అయితే ఎవరిలోనూ వైరస్‌ జాడలు కనిపించలేదని కేంద్రం తెలిపింది.


logo