మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 06, 2020 , 08:35:39

ప్రపంచంలో ఒకేరోజు 2.12 లక్షల కరోనా కేసులు

ప్రపంచంలో ఒకేరోజు 2.12 లక్షల కరోనా కేసులు

న్యూయార్క్‌: ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,12,000 కొత్త కేసులు నమోదవగా,  3586 మంది మరణించారు. ఈ కొత్త కేసుల్లో 60 శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అమెరికాలో నిన్న 40 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, బ్రెజిల్‌లో 24,431 కరోనా కేసులు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,56,641 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 5,36,776 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఈ వైరస్‌ భారినపడినవారిలో 65,34,851 మంది కోలుకోగా, మరో 44,85,014 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.   

అగ్రరాజ్యం అమెరికాలో నిన్న 40వేలకు పైగా కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసులు 30 లక్షలకు చేరువలో ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 29,82,928 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 1,32,569 మంది మరణించారు. లాటిన్‌ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య 16,04,585కు చేరింది. ఇప్పటివరకు 64,900 మంది మరణించగా, 561,070 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 8318 మంది ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు.  

అత్యధిక కరోనా కేసుల జాబితాలో నిన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న రష్యాను భారత్‌ వెనక్కి నెట్టివేసింది. దేశంలో ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 6.9 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యా నాలోగో స్థానానికి పడిపోయింది. భారత్‌లో ఇప్పటివరకు 6,97,836 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 19,700 మంది బాధితులు మృతిచెందారు. రష్యాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,251కి చేరగా, 10,161 మంది చనిపోయారు. ఐదోస్థానంలో ఉన్న పెరూలో 3,02,718 మంది కరోనా బారినపడగా, 10,589 బాధితులు చనిపోయారు. 

ఇక తొమ్మిదో స్థానంలో ఉన్న మెక్సికోలో నిన్న 4683 పాజిటివ్‌ కేసులు నమోదవగా, కొత్తగా 273 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 2,56,848కి చేరగా, ఈ వైరస్‌ వల్ల 30,639 మంది మృతిచెందారు.


logo