సోమవారం 06 జూలై 2020
International - Jun 26, 2020 , 02:18:12

కోటికి చేరువలో..

కోటికి చేరువలో..

  • ప్రపంచవ్యాప్తంగా 96.31 లక్షల కరోనా కేసులు
  • అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, రష్యా, బ్రిటన్‌లో విలయం
  • సగానికి పైగా కేసులు, మరణాలు ఈ ఐదు దేశాల్లోనే 

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో యావత్‌ ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. కేసులు కోటికి చేరువవుతుండటం శాస్త్రవేత్తలను, ప్రభుత్వాలను కలవరపెడుతున్నది. కొంతకాలంగా అమెరికాలో తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించిన ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నది. బ్రెజిల్‌లో రోజువారీ కేసులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. భారత్‌లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నది. రష్యా, బ్రిటన్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపైగా కేసులు, 52 శాతానికి పైగా మరణాలకు ఈ ఐదు దేశాలే కేంద్రంగా ఉన్నాయి.

అమెరికా విలవిల

గత ఏప్రిల్‌లో నెలకొన్న కొవిడ్‌-19 భయానక పరిస్థితులు అమెరికాలో పునరావృతమవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 38,386 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అక్టోబర్‌ 1 నాటికి కరోనా మరణాలు 1.80 లక్షలకు చేరుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ అంచనా వేసింది. బ్రెజిల్‌లో గురువారం నాటికి 12,07,721 మంది వైరస్‌ బారిన పడ్డారు. 54,434 మంది మరణించారు. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 40,995 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో 16,922 కొత్త కేసులు, 418 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసులు 4,73,105కు చేరుకున్నాయి. మొత్తం మరణాలు 14,894గా రికార్డు అయ్యాయి. 1,86,514 మంది చికిత్స పొందుతుండగా, 2,71,697 మంది (57.43 శాతం) కోలుకున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా గురువారంనాటికి 9,630,127 కేసులు నమోదుగా, 487,473 మంది  మరణించారు. 5,232,083 మంది కోలుకున్నారు.

త్వరలో కొవిడ్‌ రెండో దాడి: రణ్‌దీప్‌ గులేరియా

భారత్‌లో కరోనా వైరస్‌ రెండోసారి దాడిచేసే ప్రమాదం ఉందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. దేశంలో ఇప్పటికే కరోనా 4.5లక్షలు దాటాయి. కానీ, కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతా ల్లో కూడా రెండోసారి వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉందన్నారు. కరోనా తగ్గిన ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తే సమస్య తిరగబెడుతుందని హెచ్చరించారు. చైనా, దక్షిణ కొరియాలలో రెండో దశ వైరస్‌ దాడి ప్రారంభమైందని తెలిపారు. కొవిడ్‌-19 కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో లాక్‌డౌన్‌ అమలుచేయటం అవసరమన్నారు.

తుదిదశకు ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌


లండన్‌: కరోనా చికిత్స కోసం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, అస్ట్రాజెనికా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్‌ తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్నది. తుది దశ ప్రయోగంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లోని 10,260 మంది వలంటీర్లకు (ఇందులో పిల్లలు కూడా ఉన్నారు) ఇవ్వనున్నారు. ఈ ట్రయల్స్‌ విజయవంతమైతే, ఈ ఏడాది చివరినాటికి ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ అధిపతి ప్రొఫెసర్‌ ఆండ్రూ పొలార్డ్‌ తెలిపారు. చింపాంజీల్లో జలుబును కలిగించే ChAdOx1 అనే వైరస్‌లోని బలహీన జన్యుక్రమాల నుంచి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. 

భారత్‌లో ఒక్కరోజులో 16,922 కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి 24 గంటల వ్యవధిలో 16,922 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,73,105కి పెరిగింది. ఇదే సమయంలో తాజాగా 418 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 14,894కి చేరింది. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసులను లెక్కిస్తే ఆ సంఖ్య 2.82లక్షలకుపైగా చేరుకుంది.


దేశం
మొత్తం కేసులు
మొత్తంమరణాలు
24 గంటల్లో కేసులు
పది లక్షల జనాభాలో మరణాలు
అమెరికా
2,482,851
124,586
38,386
376
బ్రెజిల్‌
1,207,721
54,434
40,995
254
రష్యా
613,994
8,605
7,176
59
భారత్‌
4,73,105
14,894
16,922
11
బ్రిటన్‌ 
307,980
43,230
652
637



         








logo