శుక్రవారం 05 జూన్ 2020
International - May 20, 2020 , 01:45:54

ఉద్ధృతి తగ్గలేదు

ఉద్ధృతి తగ్గలేదు

  • రష్యా, లాటిన్‌ అమెరికా దేశాల్లో పెరుగుతున్న కేసులు
  • నిండిపోతున్న ఐసీయూలు.. హోటళ్లలో చికిత్సలు
  • ఈదుల్‌ ఫితర్‌ కొనుగోళ్లతో సందడిగా ఢాకా.. 

మాస్కో: కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతున్నది. రష్యా, బ్రెజిల్‌, మెక్సికో, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, భారత్‌ తదితర దేశాల్లో నమోదవుతున్న కొత్త కేసులను చూస్తుంటే ఈ విశ్వమారి ఇప్పట్లో వదిలిపోయేలా కనిపించడం లేదు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, వివిధ దేశాలు ఆర్థిక వ్యవస్థల్ని మళ్లీ తెరిచాయి. అమెరికాలో ఆటోమొబైల్‌ (వాహన) రంగంలో పనిచేసే కార్మికులు, ఫ్రాన్స్‌లో టీచర్లు, థాయిలాండ్‌లోని మాల్స్‌లో పనిచేసే సిబ్బంది ఇలా వేలాది మంది ఉద్యోగులు వైరస్‌ సోకకుండా ముందస్తు రక్షణ చర్యలు పాటిస్తూ విధుల్లోకి హాజరవుతుండటం కనిపిస్తున్నది. రష్యాలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. అయితే, 2,837 మంది మాత్రమే మరణించారని ఆ దేశాధికారులు చెబుతున్నారు. దీనిపై అంతర్జాతీయ వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 వైరస్‌కు అడ్డాగా బ్రెజిల్‌

లాటిన్‌ అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నది. బ్రెజిల్‌లోని రియో డీ జెనెరో, సావోపాలో రాష్ర్టాల్లోని దవాఖానలు రోగులతో నిండిపోతున్నాయి. ఇంటెన్సివ్‌ కేర్‌లోని పడకలు 85% నిండిపోయాయి. చిలీ రాజధాని సెంటియాగోలోనూ 90% నిండిపోయినట్టు అధికారులు తెలిపారు. కొలంబియాలో  హోటళ్లను వైద్య కేంద్రాలుగా మార్చి రోగులకు చికిత్సనందిస్తున్నారు. ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ గడువు ఉన్నప్పటికీ, ఈదుల్‌ ఫితర్‌ పర్వదినం ఉండటంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఆంక్షల్లో కొన్ని సడలింపులనిచ్చింది. దీంతో దుకాణాలు తెరుచుకున్నాయి. రాజధాని ఢాకాలో కార్లలో వచ్చిన వేలాదిమంది కొనుగోలుదారులు రోడ్లపై బారులు తీరారు. 


logo