గురువారం 04 జూన్ 2020
International - May 08, 2020 , 02:46:11

అక్టోబర్‌లోనే కరోనా ఉనికి!

అక్టోబర్‌లోనే కరోనా ఉనికి!

లండన్‌: చైనాలో గత డిసెంబర్‌లో వెలుగుచూసినట్టు భావిస్తున్న ప్రాణాంతక కొవిడ్‌-19 మహమ్మారి అంతకంటే ముందే తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించిందని లండన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ జెనెటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌'కు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. అక్టోబర్‌ 6, 2019 నుంచి డిసెంబర్‌ 11, 2019 మధ్య కరోనా తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. వైరస్‌ సోకిన 7,500 మంది రోగుల నమూనాల్ని తీసుకొని ఈ అధ్యయనాన్ని జరిపారు. సార్స్‌-కొవ్‌-2 వైరస్‌పై దాదాపు 200 రికరెంట్‌ జెనెటిక్‌ మ్యుటేషన్స్‌ (పునరావృత జన్యు ఉత్పరివర్తనలు) జరిపి ఈ వివరాలు వెల్లడించినట్టు పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ఫ్రాన్‌కోసిస్‌ బాలౌక్స్‌ పేర్కొన్నారు. 

భిన్నమైన వైరస్‌ జాతులు

కరోనాకు చెందిన రెండు వైరస్‌ జాతులు ప్రపంచదేశాలకు వ్యాపించాయని, ఇవి ఒకదానికి మించి మరొకటి శక్తిమంతంగా ఉన్నట్టు చైనా శాస్త్రవేత్తలు గత మార్చిలో వెల్లడించారు. రెండు వైరస్‌ జాతులు భిన్నంగా ఉన్నాయని, అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక జాతి వైరస్‌ మాత్రమే వ్యాపిస్తున్నట్టు తాము గుర్తించామని బ్రిటన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో శాస్త్రవేత్తలు తెలిపారు.  కాగా, గత డిసెంబర్‌ 27న ఫ్రాన్స్‌లోని ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు గత డిసెంబర్‌ కంటే ముందే ఎక్కడైనా కరోనా కేసులు నమోదయ్యాయా అన్నది  దర్యాప్తు జరుపాలని పలు దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది.


logo