శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 08, 2020 , 11:18:27

722కు చేరిన కరోనా వైరస్‌ మృతుల సంఖ్య

722కు చేరిన కరోనా వైరస్‌ మృతుల సంఖ్య

బీజింగ్‌ : చైనాలో కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 722 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో మొత్తం కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 34,546కు చేరింది. 3,399 మందికి కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు నిర్ధారించినట్లు చైనా జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. క‌రోనా వైర‌స్ పుట్టిన ప్రాంత‌మైన‌ హుబేయ్ ప్రావిన్సులో అత్య‌ధిక స్థాయి మ‌ర‌ణాలు న‌మోదు అవుతూనే ఉన్నాయి. 

కరోనాపై చైనా ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ మృతిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన మృతిపై విచారణ జరిపేందుకు చైనా ప్రభుత్వం వుహాన్‌కు దర్యాప్తు బృందాన్ని పంపింది. వైరస్‌ గురించి గత డిసెంబర్‌లోనే లీ వెల్లడించారు. అయితే ‘వదంతులు’ వ్యాప్తి చేయొద్దని పోలీసులు ఆయనను హెచ్చరించి వదిలేశారు. అనంతరం రోగులకు చికిత్స చేస్తు న్న క్రమంలో వైరస్‌ బారినపడి గురువారం ప్రాణాలు కోల్పోయారు. లీ మృతి పట్ల చైనా వ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తమవుతున్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు  సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రపంచం ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా లీ మృతికి సంతాపం  తెలిపింది. 

కరోనాపై తాము ‘ప్రజాయుద్ధం’ మొదలుపెట్టామని, అమెరికా కూడా తగిన సహకారం అందించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ తో ఫోన్‌లో కోరారు. కాగా, కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి పాంగోలిన్స్‌ (అలుగు) ద్వారా మనుషులకు సంక్రమించి ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా, వుహాన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చేటప్పుడు పాక్‌ విద్యార్థులనూ తెచ్చేందుకు సిద్ధమని పాక్‌కు తెలిపినట్లు విదేశాంగమంత్రి జైశంకర్‌ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.


logo