శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 22, 2020 , 00:07:50

నిర్లక్ష్యం వద్దు!

నిర్లక్ష్యం వద్దు!

-కరోనా బాధితురాలి హెచ్చరిక

లండన్‌: కరోనా వైరస్‌ను తేలికగా తీసుకునేవారికి లండన్‌కు చెందిన కరోనా బాధితురాలు తారాజేన్‌ లాంగ్‌స్టన్‌ (39) గట్టి హెచ్చరికలు చేశారు. ‘ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వహిస్తే మీక్కూడా నా పరిస్థితే ఎదురవుతుంది’ అని హెచ్చరించారు. దవాఖానలోని ఐసీయూ బెడ్‌ నుంచి ఆమె ఒక వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయగా అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. వీడియో తీసిన సమయంలో శ్వాస తీసుకునేందుకు కూడా ఆమె ఇబ్బందిపడ్డారు. అప్పటికి ఆమె పరిస్థితి దయనీయంగా ఉన్నా.. అంతకు ముందటితో పోలిస్తే అది పదిరెట్లు మేలని ఆమె వ్యాఖ్యానించారు. ‘కరోనాపై నా వైఖరి ఎలా ఉండేదంటే.. అదో పెద్ద నాన్సెన్స్‌. ఎక్కువ చేసి చెప్తున్నారు అని అనుకునేదాన్ని. అయితే ఆ తర్వాత నాకు వైరస్‌ సోకింది. ఇంకెప్పుడూ ఇలాంటి పరిస్థితిని నేను కోరుకోవడం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

ముందుచూపుతో కట్టడి

ముందుచూపుతో కరోనాను కట్టడి చేయవచ్చని, ప్రజలు సహకరిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని జపాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ నిరూపించాయి. ఒలంపిక్స్‌ను కచ్చితంగా నిర్వహిస్తామని జపాన్‌ చెప్పడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. 


చట్టాలనే మార్చిన జపాన్‌ 

జపాన్‌లో తొలి కరోనా కేసు జనవరి 10న వెలుగుచూసింది. అప్పటికి అది కొవిడ్‌-19అని తెలియదు. అయినా  ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించలేదు.అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆంక్షలు విధించింది. జనవరి 24న రెండో కేసు నమోదైన వెంటనే ప్రధాని షింజో అబే అత్యవసరంగా క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. జనవరి 28న వైరస్‌ను ‘అంటురోగం’గా ప్రకటించారు. ప్రజలు గుమిగూటంపై ఆంక్షలు లేని చట్టాన్ని సవరించారు. డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో కరోనా ప్రబలడంతో కఠినంగా వ్యవహరించింది. కేసులను వెయ్యికి పరిమితం చేసింది. 230 మంది కోలుకోగా, 35 మంది మరణించారు. 

సింగపూర్‌.. యమ స్ట్రిక్ట్‌

సింగపూర్‌లో జనవరి 23న తొలికేసు నమోదైంది. దాదాపు రెండు నెలలు గడుస్తున్నా కేసుల సంఖ్య 430కే పరిమితమైందంటేనే ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. రోగుల్లో 140 మంది కోలుకోగా, ఇద్దరు మాత్రమే మరణించారు. 

హాంకాంగ్‌.. వాయువేగం

హాంకాంగ్‌ జనవరి మొదటివారం నుంచే కఠిన చర్యలు తీసుకుంది. ప్రజల కదలికలపై ఆంక్షలు విధించింది. అందరూ మాస్కులు ధరించాలని ఆదేశించింది. 22న మొదటి కేసు నమోదుకాగా.. 25న ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పటివరకు 155కేసులు నమోదవ్వగా 100 మంది కోలుకున్నారు. నలుగురు మరణించారు.


logo