శనివారం 30 మే 2020
International - May 04, 2020 , 19:04:16

కరోనాకు అసలు టీకా అనేది రానేరాదా?

కరోనాకు అసలు టీకా అనేది రానేరాదా?

హైదరాబాద్: కరోనా ఓ వైపు దేశదేశాల్లో కల్లోలం సృష్టిస్తుంటే మరోవైపు వైద్యనిపుణులు టీకా కనిపెట్టేందుకు అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. సుమారు వంద వ్యాక్సిన్లు వేరువేరు దశల్లో ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వ్యాక్సిన్ మానవ పరీక్షల దశకు చేరుకున్నదని అంటున్నారు. అమెరికా వ్యాక్సిన్ మరో ఆరునెలల్లో సిద్ధం అవుతుందని ప్రచారం జరుగుతున్నది. అయితే అసలు కరోాకు వ్యాక్సిన్ తయారు కాకపోవచ్చని కొందరు ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇదేం కొత్త కాదని వారు అంటున్నారు. ఇప్పటిదాకా హెచ్ఐవీ, డెంగ్యూ వంటి వైరస్‌లకు వ్యాక్సిన్ రాకపోవడాన్ని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. 'కొన్నిరకాల వైరస్‌లకు ఇప్పటికీ వ్యాక్సిన్ అనేదే రాలేదు' అని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్  లండన్ ప్రపంచ ఆరోగ్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ నబారో అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ అనేది తప్పనిసరిగా వస్తుందని, ఒకవేళ వచ్చినా సామర్థ్యం, భద్రతకు సంబంధించి అన్ని పరీక్షల్లో నెగ్గుతుందని కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కోవిడ్-19 సలహాదారుగా ఉన్నారు. వ్యాక్సిన్ రావడానికి సంవత్సరం నుంచి సంవత్సరంనర కాలం పడుతుందని అమెరికా ప్రభుత్వ అంటువ్యాధుల సలాహాదారు డాక్టర్ ఆంటోనీ ఫాసీ  అంటున్నారు. ఏదిఏమైనా వ్యాక్సిన్ లేదా టీకా కనుగొనడం అనేది సుదీర్ఘమైన, కష్టసాధ్యమైన ప్రక్రియ అని నబారో లాంటివారు అభిప్రాయపడుతున్నారు.


logo