శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Feb 29, 2020 , 15:12:17

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’

హైదరాబాద్‌: చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్‌ ‘కరోనా’ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. చైనాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 2వేలకు పైగా పౌరులు మరణించగా.. వేలాది మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ  ప్రాణాంతక వైరస్‌.. చైనాతో పాటు 57 దేశాలకు విస్తరించింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,910 మందికి పైగా మరణించారు. 85వేల మందికి ఈ వైరస్‌ సోకింది. ఈ వైరస్‌ దెబ్బకు అనేక దేశాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. కరోనా వైరస్‌కు అంటువ్యాధిగా మారే సత్తా ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో(వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) తెలిపింది. ఈ వ్యాధి భయంతో సైప్రస్‌లో జరగనున్న షూటింగ్‌ ప్రపంచకప్‌ నుంచి భారత్‌ వైదొలిగింది.

ఈ వైరస్‌ బారినపడి మరణించిన వారిలో చైనా తర్వాత అత్యధికంగా ఇరానీలు ఉన్నారు. దక్షిణ కొరియాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అంటార్కిటికా మినహా మిగితా 6 ఖండాల్లో కరోనా వ్యాపించింది. కరోనా కారణంగా లాస్‌వెగాస్‌లో జరగాల్సిన తూర్పు ఆసియా దేశాల అధినేతల సమావేశం వాయిదా పడింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యూందాయ్‌ దక్షిణ కొరియాలోని తమ ప్లాంటును మూసివేసింది. మార్చి 15 వరకు దేశంలో నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు స్విట్జర్లాండ్‌ ప్రకటించింది. జెనీవాలో జరపాల్సిన అంతర్జాతీయ మోటార్‌ ప్రదర్శనను స్విస్‌ ప్రభుత్వం రద్దు చేసింది. సౌదీ, బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌ దేశాలలో 2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 


logo