గురువారం 28 మే 2020
International - Apr 23, 2020 , 12:37:49

26 అమెరికా యుద్ధనౌకల్లో కరోనా

26 అమెరికా యుద్ధనౌకల్లో కరోనా

హైదరాబాద్: అమెరికా విమాన వాహక యుద్ధనౌక థియోడోర్ రూజ్‌వెల్ట్ కరోనా కల్లోలంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ నౌక కెప్టెన్ నావికులను కాపాడాలి అంటూ సందేశం పెడితే నౌకాదళ పెద్దలు గుర్రుమన్నారు. నావికులను ఒడ్డుక తరలించి చికిత్సలు జరిపించినప్పటికీ ఆ నౌక కెప్టెన్‌ను బాధ్యతల నుంచి తప్పించారు. అయితే కరోనా బారిన పడింది ఆ ఒక్క నౌక మాత్రమే కాదు. సుమారు 26 అమెరికా యుద్ధ నౌకలను కరోనా చుట్టేసిందని ఓ సీనియర్ నేవీ అధికారిని ఉటంకిస్తూ సీఎన్ఎన్ వెల్లడించింది. అయితే ఈ 26 నౌకలూ ప్రస్తుతం రేవుల్లో లేక మరమ్మత్తుల యార్డుల్లో ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. ఇవికాక మరో 14 నౌకల్లోని సిబ్బందికి కరోనా వచ్చి తగ్గిపోయిందట. అయితే రక్షణ విభాగం నిబంధనల మేరకు నౌకాదళం సదరు నౌకల పేర్లు వెల్లడించడం లేదు. అమెరికా నౌకాదళంలో ప్రస్తుతం 297 యుద్ధనౌకలు ఉన్నాయి. అందులో 90 సముద్రాల్లో తిరుగుతున్నాయి. బుధవారం నాటికి అమెరికా రక్షణ దళాలకు చెందిన 3,578 మంది సభ్యులకు కరోనా పాజిటివ్ రాగా వారిలో ఇద్దరు మరణించారు. అందులో సుమారు 800 పాజిటివ్‌లు, ఒక మరణం రూజ్‌వెల్ట్‌కు చెందినవే. ఆ నౌకకు చెందిన 4,000 మంది నావికులను తీరానికి తరలించి 14 రోజుల ఐసోలేషన్‌లో ఉంచారు. వచ్చేవారం వారంతా తిరిగి నౌకలో డ్యూటీకి ఎక్కాలి. కానీ ఇప్పటివరకు లక్షణాలు లేని 120 మందికి పాజిటివ్ రావడంతో వాయిదా వేశారు. లక్షణాలు లేనివారిలో వైరస్ ఎన్నాళ్లు మనుగడ సాగిస్తుందో తెలుసుకునేంతవరకు రేవుల్లో గడుపుతున్న నావికులు ఎవరినీ నౌకలపై డ్యూటీకి పంపరాదని నిర్ణయించారు. ఈ మేరకు పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ అడ్మిరల్ జాన్ అక్విలినో తన కింది అధికారులకు ఆదేశాలు పంపినట్టు సీఎన్ఎన్ తెలిపింది.


logo