మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Mar 15, 2020 , 09:58:26

కరోనా భయంతో.. క్యాంపస్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు!

కరోనా భయంతో.. క్యాంపస్‌లో ఆన్‌లైన్‌ క్లాసులు!

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది 1,26,000 మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసింది. 4,000 మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 127 దేశాలను వణికిస్తున్నందున వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తమవంతు కృషి చేస్తున్నాయి. దీంట్లో భాగంగానే అగ్రరాజ్యం అమెరికా యూనివర్సిటీ క్యాంపస్‌లు ఖాళీ చేయాలని ఆదేశించింది. విద్యార్థులు క్యాంపస్‌లు ఖాళీ చేస్తూ ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. విదేశీ విద్యార్థుల పరిస్థితి ఏంటి? కొన్ని విశ్వవిద్యాలయాలు తమ ప్రాంతాలకు వెళ్లిపోండి అని సూచిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.

అర్థంతరంగా వెళ్లిపొమ్మంటే ఎలా అని పేరెంట్స్‌ నుంచి కూడా అభ్యర్థనలు పెరగడంతో కొన్ని యూనివర్సిటీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేశాయి. తాజాగా ఆమ్‌హెస్ట్‌ కాలేజీ ఆన్‌లైన్‌ క్లాసులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులందరికీ సంబంధిత ప్రొఫెసర్ల ద్వారా క్లాసులు ఇప్పిస్తూ సిలబస్‌కు ఎలాంటి ఆటంకాలు జరగకుండా కార్యచరణ సిద్ధం చేసింది. ఆన్‌లైన్‌ క్లాసుల విధానాన్ని పరిశీలించిన హార్వర్డ్‌.. వెస్లియన్‌.. గ్రినెల్‌.. కాలిఫోర్నియా.. శాంటా బార్బరా.. మిచిగాన్‌ యూనివర్సిటీలు కూడా దీనిపై అధ్యయనం చేస్తున్నాయట. ఇప్పటికే ఈ యూనివర్సిటీలన్నీ తమ యాక్టివిటీస్‌ను షట్‌డౌన్‌ చేశాయి. పరిస్థితిలో మార్పులను బట్టి 2-3 వారాల్లో తిరిగి క్యాంపస్‌లను తెరిచే ప్రయత్నాల్లో ఉన్నట్లు యూనివర్సిటీలు పేర్కొన్నాయి. 


logo