శనివారం 06 జూన్ 2020
International - Apr 17, 2020 , 15:31:00

చైనాలో ఒక్కసారిగా పెరిగిన క‌రోనా మరణాల సంఖ్య

 చైనాలో ఒక్కసారిగా పెరిగిన క‌రోనా మరణాల సంఖ్య

చైనాలో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోందా...లేక గ‌తంలో క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్యను చైనా దాచిపెట్టిందా? కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రమైన‌ వుహాన్ నగరంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని వారాలుగా  చైనాలో 3,300గా ఉన్న మరణాల సంఖ్య ఇప్పుడు ఒక్కసారిగా 4,600కి చేరుకుంది. అందుకు కారణం ఈ వైరస్‌కి కేంద్ర బిందువైన వుహాన్‌లో మరణాల సంఖ్య ఏకంగా 50 శాతం పెరగడమేన‌ట‌.

అక్కడ మొత్తంగా 1,290 మంది కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని తాజాగా వెల్లడైంది.  దీనిపైన అక్కడి స్థానిక ప్రభుత్వం స్పందించింది. నగరంలో కరోనా వ్యాప్తి ప్రారంభ రోజుల్లో తప్పుగా లెక్కించడం జరిగిందని అంగీకరించింది. ప్రైవేట్‌, తాత్కాలిక ఆస్పత్రుల నుంచి సమాచారాన్ని సేకరించడంలోనూ జాప్యం జరిగిందని, వ్యాప్తి ప్రారంభ దశలో ఆసుపత్రులు తట్టుకోలేక పోవడంతో కొంతమంది రోగులు ఇంట్లో మరణించారని వెల్లడించింది. ఏదేమైనా చైనా చెప్తున్న‌ గణాంకాలపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.


logo