ఆదివారం 05 జూలై 2020
International - May 26, 2020 , 07:50:23

అర కోటి దాటి.. కోటి వైపు పరుగు

అర కోటి దాటి.. కోటి వైపు పరుగు

పారిస్‌: కరోనా కరాళనృత్యం చేస్తున్నది. పుట్టిళ్లు చైనాను వదిలిన కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. 214 దేశాలకు విస్తరించిన ఈ ప్రాంణాంతక వైరస్‌ ఇప్పటివరకు 3,47,872 మందిని పొట్టన పెట్టుకున్నది. ప్రపంచవ్యాప్తంగా 55,87,582 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో 23,65,703 మంది కోలుకోగా, మరో 28,74,007 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. పెద్దన్న అమెరికాలో ఇప్పటివరకు 17,06,226 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ వైరస్‌ ప్రభావంతో 99805 మంది మరణించారు. తక్కువ సమయంలో రెండో స్థానానికి దూసుకు వచ్చిన బ్రెజిల్‌ ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 3,76,669 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 23,522 మంది మరణించారు. దేశంలో 1,99,314 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,53,833 మంది బాధితులు కోలుకున్నారు. 

రష్యాలో కరోనా మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, పాజిటివ్‌ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 353,427 కేసులు నమోదవగా, 3633 మంది మరణించారు. మరో 2,30,996 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. స్పెయిన్‌లో కరోనా కేసుల సంఖ్య 2,82,480కి చేరాయి. దేశంలో ఇప్పటివరకు 26,837 మంది మరణించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 261,184 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 36914 మంది మృతిచెందారు. ఇటలీలో 230,158 పాజిటివ్‌ కేసులు ఉండగా, 32877 మంది కన్నుమూశారు. ఫ్రాన్స్‌లో 182,942 పాజిటివ్‌ కేసులు ఉండగా, 28,432 మంది మరణించారు. కరోనా వైరస్‌తో జర్మనీలో 180,789 కేసులు, 8428 మృతులు, టర్కీలో 157,814 కేసులు, 4369 మరణాలు సంభవించాయి. 

ఇక రెండు రోజుల క్రితం కరోనా కేసుల జాబితాలో పదో స్థానానికి చెరిన భారత్‌.. త్వరలోనే టర్కీని వెనక్కి నెట్టి తొమ్మిదో స్థానానికి చేరేలా కన్పిస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 144,950 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 4172 మంది బాధితులు మరణించారు.


logo