సోమవారం 13 జూలై 2020
International - May 26, 2020 , 01:24:36

భారత్‌పై మరోసారి అక్కసువెళ్లగక్కిన నేపాల్‌ ప్రధాని

భారత్‌పై మరోసారి అక్కసువెళ్లగక్కిన నేపాల్‌ ప్రధాని

మీవల్లే కరోనా కేసులు

కాట్మండు: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. తమ దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి భారతే కారణమని సోమవారం ఆరోపించారు. సరిహద్దుల గుండా తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వాళ్లకు భారత్‌ సరైన పరీక్షలు నిర్వహించడంలేదని మండిపడ్డారు. దీంతో తమ దేశంలో వైరస్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. అయినప్పటికీ, దక్షిణాసియా దేశాల్లో నేపాల్‌లోనే తక్కువ కొవిడ్‌-19 మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆత్మైస్థెర్యం, ఆహారపుటలవాట్ల వల్లనే కరోనా మరణాలు తక్కువగా నమోదవుతున్నట్టు ఓలి వివరించారు. కాగా భారత్‌లోని భూభాగాల్ని తమ ప్రాంతాలుగా చూపుతూ ఇటీవల నేపాల్‌ కవ్వింపులకు పాల్పడటం తెలిసిందే.

గూర్ఖాల మనోభావాల్ని దెబ్బతీశారు: నేపాల్‌ రక్షణ మంత్రి

చైనాను పరోక్షంగా ఉదహరిస్తూ ‘ఒక దేశం ఆదేశాల’ ప్రకారం నేపాల్‌ ప్రవర్తిస్తున్నదని భారత సైన్యాధిపతి మనోజ్‌ ముకుంద్‌ నరవణే చేసిన వ్యాఖ్యలపై నేపాల్‌ రక్షణ మంత్రి ఇష్వోర్‌ పోఖ్రెల్‌ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తమ దేశ చరిత్ర, స్వేచ్ఛ, విధానాల్ని అవమానపరుస్తున్నాయన్నారు. భారత్‌ రక్షణ కోసం తమ ప్రాణాల్ని అర్పిస్తున్న గూర్ఖా సైన్య దళాల మనోభావాల్ని నరవణే దెబ్బతీశారన్నారు.


logo