గురువారం 04 జూన్ 2020
International - May 15, 2020 , 13:43:08

చిన్నవాళ్లకు రాదన్నది భ్రమే.. చిచ్చరపిడుగు సవాల్

చిన్నవాళ్లకు రాదన్నది భ్రమే.. చిచ్చరపిడుగు సవాల్

స్టాక్‌హోం: కరోనా గురించి రకరకాల అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. చిన్నపిల్లలకు అది సోకదని, ఒకవేళ సోకినా వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని ఈ మధ్య వినిపిస్తున్నది. అయితే చిన్నపిల్లలకు రాదన్నది భ్రమేనని చిచ్చరపిడుగు గ్రెటా థున్‌బెర్గ్ అంటున్నది. అది భ్రమ కాదని ఎవరైనా రుజువు చేయాలని సవాల్ విసిరింది. పర్యావరణ అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వంటి ప్రపంచ నేతలనే‌ ఢీకొన్న ధీశాలి స్వీడన్‌కు చెందిన ఈ చిన్నారి. పర్యావరణ అంశాలపై స్కూళ్లల్లో సమ్మెలు చేయించిన గడుగ్గాయి ఇప్పుడు కరోనా గురించి జరుగుతున్న పక్కిటి పురాణాల్ని సవాల్ చేస్తున్నది. పిల్లలకు కరోనా సోకదని, వారు దానిని వ్యాపింపజేయరని అనుకోవడం శుద్ధ తప్పేనని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టింది. పర్యావరణ సమస్యలపై నోరు విప్పి మా  పిల్లల భవిష్యత్తు ఏమిటి అని పెద్దలను నిలదీసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి టైమ్ పత్రిక కవర్ మీదకు చేరుకోవడమే కాకుండా రైట్ లైవ్లీహుడ్ వంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. కరోనాపై తప్పుడు ప్రచారాన్ని ఏమాత్రం నమ్మవద్దని, భౌతికదూరం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది పదిహేడేళ్ల గ్రెటా. తనకూ మార్చిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తే అందరికీ దూంరగా ఉన్నానని చెప్పింది. చిన్నపిల్లలు లక్షణాలు బయటపడకుండానే ఇతరులకు వ్యాధి అంటించే ప్రమాదం ఉందని ఈ అమ్మాయి అంటున్నది. శాస్త్రవేత్తలను నమ్మాల్సిన అవసరాన్ని చాలామంది గుర్తిస్తున్నారని, ఇది మంచిదని గ్రెటా చెప్పింది. వాతావరణ, పర్యావరణ సంక్షోభాలపై కూడా శాస్త్రవేత్తలను నమ్మితే మంచిదని ఆశిస్తున్నట్టు తెలియజేసింది.


logo