సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 05, 2020 , 01:47:41

పోస్టల్‌ శాఖ.. ట్రంప్‌ పాట

పోస్టల్‌ శాఖ.. ట్రంప్‌ పాట

  • బ్యాలెట్ల తరలింపుపై వివాదాస్పద వైఖరి
  • కోర్టు ఆదేశాలు పాటించబోమని వాదన

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 10 కోట్ల మందికి పైగా ఓటర్లు మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మంగళవారం అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్‌ జరిగింది. దీంట్లో మరో 6 కోట్ల మంది ఓటు వేసినట్లు అంచనా. పోలింగ్‌ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అయితే, వివిధ రాష్ర్టాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఉండిపోయిన బ్యాలెట్‌ బాక్సుల్లో కొన్ని లక్షల ఓట్లు ఇంకా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోలేదు. దీంతో అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ ఏజెన్సీకి వాష్టింగ్టన్‌ డీసీ జిల్లా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మిగతా పోస్టల్‌ కార్యకలాపాలను నిలిపివేసి వెంటనే బ్యాలెట్లను లెక్కింపు కేంద్రాలకు చేర్చాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కానీ, దీనికి పోస్టల్‌ ఏజెన్సీ ససేమిరా అంటున్నది. బ్యాలెట్ల తరలింపునకే పూర్తిగా ప్రాధాన్యం ఇస్తే, ఎన్నికల కార్యకలాపాలకు అటంకాలు ఎదురవ్వచ్చని ఆ సంస్థ తరుఫు న్యాయవాదులు చెబుతున్నారు. 

వివాదాల పోస్ట్‌ మాస్టర్‌

అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ ఏజెన్సీకి అధిపతిగా (పోస్ట్‌ మాస్టర్‌గా) వ్యవహరిస్తున్న జనరల్‌ లూయిస్‌ డీజోయ్‌ రిపబ్లికన్‌ పార్టీ సానుభూతిపరుడు. ఆ పార్టీకి భారీఎత్తున నిధుల్ని సమకూర్చే ప్రముఖ వ్యక్తి. పోస్టల్‌ శాఖలో ఇటీవల ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. కాగా మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్ల తరలింపును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడానికే డీజోయ్‌ ఇలా వ్యవహరిస్తున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.