వ్యాక్సిన్ కోసం మందు మానలేం!

రష్యాలో స్పుత్నిక్ వీ వినియోగంపై డైలమా
రెండు నెలలు మద్యం మానాలన్న ప్రభుత్వం
మందుమానే ప్రసక్తే లేదంటున్న రష్యన్లు
గ్లాస్ మందుతో సమస్యేమీ రాదన్న శాస్త్రవేత్తలు
మాస్కో: రష్యాలో కరోనా టీకా వాడకం మొదలు పెట్టకముందే వివాదం చెలరేగుతున్నది. వ్యాక్సిన్ వేసుకొనేవారు రెండు నెలలు మద్యం మానేయాలన్న ప్రభుత్వ సూచనను శాస్త్రవేత్తలు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కరోనా వచ్చినాసరే మందు మానేసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఒక గ్లాసు మద్యం సేవించినంత మాత్రాన దుష్ఫలితం ఏమీ ఉండదని వ్యాక్సిన్ తయారీదారులు అంటున్నారు.
అసలేం జరిగింది?
రష్యాలో కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని 2-3 రోజుల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పుత్నిక్ వీ టీకాను రెండు డోసులుగా 21 రోజుల ఎడంతో వేయనున్నారు. టీకాలు వేసుకొనేవారు 42 రోజులు మద్యం మానేయాలని ఆ దేశ ఉప ప్రధాని తతియానా గొలికోవా సూచించారు. ఈ సూచనను ప్రజలే కాకుండా స్పుత్నిక్ వీ టీకాను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ గిన్స్బర్గ్ కూడా వ్యతిరేకించారు. ‘కేవలం ఒక గ్లాసు షాంపేన్ రోగనిరోధక శక్తిని పాడుచేయదు’ అని ట్వీట్ చేశారు. అయితే, టీకా వేసుకొనేముందు మూడు రోజులు.. తర్వాత మూడు రోజులు మద్యం సేవించకపోవటమే మంచిదని సూచించారు.
వ్యాక్సిన్ వద్దు.. మందే ముద్దు
మద్యపాన సేవనంలో ప్రపంచంలోనే రష్యా నాలుగో స్థానంలో ఉన్నది. రష్యన్లు సగటున ఏడాదికి 15.1 లీటర్ల మద్యం సేవిస్తారని అంచనా. ఆ దేశంలో రాబోయేది సెలవుల సీజన్. ఆ సమయంలో మద్యం అమ్మకాలు రెట్టింపు అవుతాయి. దాంతో టీకా కోసం మందు మానేయాలన్న సూచనను సామాన్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘ఈ సూచన నాకు నిజంగానే ఆందోళన కలిగిస్తున్నది. టీకా వేసుకుంటే 80 రోజులపాటు మద్యం సేవించేందుకు నాకు అవకాశం ఉండదు. నేను తీవ్రమైన ఒత్తిడికి గురవుతాను. అందునా ఇది పండుగ సమయం. ఇలాంటి పరిస్థితుల్లో టీకా సైడ్ ఎఫెక్టులకంటే మందు మానేయటం వల్ల జరిగే నష్టమే ఎక్కువ’ అని మాస్కోవాసి ఎలెనా క్రివెన్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కొవిడ్-19 టీకాలు మొదలుపెట్టిన బ్రిటన్లో పౌరులను మద్యం సేవించరాదన్న సూచనేమీ చేయలేదు. రష్యాలోనే ఇలాంటి సలహా ఇవ్వటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.