శనివారం 30 మే 2020
International - Apr 07, 2020 , 14:46:27

ట్రంప్ గారూ.. మరీ అంత బరితెగించి బెదరించడమా?

ట్రంప్ గారూ.. మరీ అంత బరితెగించి బెదరించడమా?

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాను బెదరించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దేశాధినేత ఇలా మరొక దేశాన్ని బెదరించడం తన దశాబ్దాల అనుభవంలో ఎన్నడూ చూడలేదని ట్విట్టర్ లో థరూర్ విస్మయం వ్యక్తం చేశారు. కరోనాకు మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడాలనేది ట్రంప్ వాదన. ఐతే వైద్యరంగం మాత్రం ఈ వాదనను అంగీకరించడం లేదు. ఆ మందు కరోనాకు పనిచేస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని అంటున్నది. కానీ ట్రంప్ మొండిగా అదేమందు వాడాలని తన సిబ్బందిని కూడా కాదని పట్టుబట్టి మరీ వాదిస్తున్నారు. అయితే ఆ మందు అమెరికా దగ్గర తగినంతగా లేదు.

అమెరికా దిగుమతిలో సగం ఇండియా నుంచి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా ఆ మందు ఎగుమతిని నిలిపివేసింది. సరిగ్గా దీనిమీదే ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇండియా మా సరఫరా చేయకపోతే ప్రతికారం తప్పకపోవచ్చని అసాధారణమైన రీతిలో బెదరింపులకు దిగారు. గతంలో ఐక్యరాజ్య సమితిలో అండర్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించిన థరూర్ అమెరికా అధ్యక్షుడి తీరును తప్పుబట్టారు. మా సరఫరా ఏమిటని నిలదీశారు. ఇండియా సరఫరా చేసినప్పుడే అది మీ సరఫరా అవుతుందని గుర్తుచేశారు.


logo