ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Jul 13, 2020 , 19:09:43

కరోనా నేపథ్యంలో.. సంపూర్ణ మద్యపాన నిషేధం

కరోనా నేపథ్యంలో.. సంపూర్ణ మద్యపాన నిషేధం

కేప్‌టౌన్: దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరనా కేసుల తీవ్రత నేపథ్యంలో మరోసారి సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన దక్షిణ ఆఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ కేసుల నమోదు 13,500కు చేరినట్లు చెప్పారు. దీంతో దవాఖానలన్నీ కరోనా రోగులతో నిండిపోయాయని, కొత్తవారిని చేర్చుకునే పరిస్థితి లేదన్నారు.

మరోవైపు మద్యంపై నిషేధాన్ని జూన్‌లో ఎత్తివేయడంతో దవాఖానల్లోని ఎమర్జెన్సీ వార్డుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగిందని అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించడం,  అమ్మకాలపై తిరిగి నిషేధం విధిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాత్రి పూట కర్ఫ్యూను తిరిగి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. బహిరంగ ప్రదేవాల్లో తిరిగే ప్రజలంతా మాస్కులు ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. దక్షిణ ఆఫ్రికాలో 2.76 లక్షల మందికి కరోనా సోకగా, ఇప్పటి వరకు నాలుగు వేల మందికిపైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావిత దేశాల్లో ఇది పదోస్థానంలో ఉన్నది.


logo