గురువారం 26 నవంబర్ 2020
International - Nov 06, 2020 , 02:11:19

పోటాపోటీ నిరసనలు..

పోటాపోటీ నిరసనలు..

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌, ప్రత్యర్థి జో బైడెన్‌ నువ్వా.. నేనా అనే రీతిన తలపడుతున్నారు. అయితే, అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి కావలసిన మ్యాజిక్‌ ఫిగర్‌కు బైడెన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ మద్దతుదారులు నిరసనకు దిగారు. మిషిగన్‌ రాష్ట్రంలోని డెట్రాయిట్‌ నగరం, ఆరిజోనాలోని ఫోనిక్స్‌ నగరంలోని కౌంటింగ్‌ కేంద్రాల ముందు ఆందోళన చేపట్టారు. వెంటనే కౌంటింగ్‌ను నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. కీలక రాష్ర్టాల్లో బైడెన్‌ ఆధిక్యాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌ను నిలిపివేయాలని ట్రంప్‌ వివిధ కోర్టులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన మద్దతుదారులు కౌంటింగ్‌ కేంద్రాల ముందు చేరుకొని నిరసనలు తెలిపారు. పూర్తిస్థాయిలో కౌంటింగ్‌ ముగియకుండానే ‘బైడెన్‌' గెలిచాడని పేర్కొన్న ‘ఫాక్స్‌ న్యూస్‌' మీడియా సంస్థ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, పోలైన ప్రతి ఓటును తప్పనిసరిగా లెక్కించాల్సిందేనని పేర్కొంటూ బైడెన్‌ మద్దతుదారులు అమెరికాలోని పలు నగరాల్లో ర్యాలీలు చేపట్టారు. కౌంటింగ్‌ను అడ్డుకోవాలని చూస్తున్న ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  పోర్ట్‌ల్యాండ్‌, మినియాపోలిస్‌, లాస్‌ ఏంజెల్స్‌, షికాగో తదితర నగరాల్లో నిరసనలు చేపట్టారు. ఇంకోవైపు, మేలో జరిగిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ దారుణహత్య నేపథ్యంలో జాతి వివక్షకు గురవుతున్న తమకు న్యాయం చేయాలని పోర్ట్‌ల్యాండ్‌, మినియాపోలిస్‌లో పలువురు నిరసనకు దిగారు. 

బైడెన్‌ కొత్త రికార్డు 


అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ ఏ అధ్యక్ష అభ్యర్థి సాధించలేనంత భారీ సంఖ్యలో ఓట్లను జో బైడెన్‌ సాధించారు. బుధవారం నాటికి ఆయనకు 7.22 కోట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 2008 అధ్యక్ష ఎన్నికల్లో బరాక్‌ ఒబామా 6,94,98,516 పాపులర్‌ ఓట్లను సాధించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఒబామాతో పోలిస్తే 25 లక్షల కంటే ఎక్కువ ఓట్లతో బిడెన్‌ దూసుకుపోతున్నారు. 

అమెరికా చరిత్రలోనే హోరాహోరీ

ట్రంప్‌ ప్రస్తుతం లీడ్‌లో ఉన్న రాష్ర్టాల్లో విజయం సాధిస్తే ఆయనకు 268 ఎలక్టోరల్‌ ఓట్లు లభిస్తాయి. నెవాడాలో బైడెన్‌ విజయం సాధిస్తే మ్యాజిక్‌ ఫిగర్‌ 270ని చేరుకుంటారు. ఇదే గనక జరిగితే అమెరికా చరిత్రలో అత్యంత హోరాహోరీగా జరిగిన ఎన్నికలుగా ఇవి కూడా రికార్డులకెక్కుతాయి. 1876లో రూథర్‌ఫర్డ్‌ హాయెస్‌ ఒకేఒక్క ఎలక్టోరల్‌ ఓటు తేడాతో గెలిచారు