ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 01:50:51

ముగిసిన నోబెల్‌ పురస్కారాలు

ముగిసిన నోబెల్‌ పురస్కారాలు

  • ఆక్షన్‌ థియరీకి ఆర్థికశాస్త్ర నోబెల్‌
  • అమెరికన్‌ ఆర్థికవేత్తలు పాల్‌ మిల్‌గ్రామ్‌, రాబర్ట్‌ బీ విల్సన్‌లకు సంయుక్తంగా ప్రకటన

స్టాక్‌హోం, అక్టోబర్‌ 12: వేలం సిద్ధాంతంలో (auction theory) విశేష కృషిచేసిన అమెరికన్‌ ఆర్థికవేత్తలు పాల్‌ ఆర్‌ మిల్‌గ్రామ్‌ (72), రాబర్ట్‌ బీ విల్సన్‌ (83) లకు ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ పురస్కా రం లభించింది. హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ఈ గురుశిష్యులు రూపొందించిన వేలం సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విరివిగా వాడుతున్నారు. వీరి కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు, కొనుగోలుదారులు, పన్నుచెల్లింపుదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరిందని సోమవారం పురస్కారం ప్రకటన సందర్భంగా రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్స్‌  కార్యదర్శి గోరన్‌ హన్సన్‌ ప్రశంసించారు. విజేతలకు నోబెల్‌ పతకం, ప్రశంసా పత్రం, రూ.8కోట్ల నగదు అందజేస్థారు. ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ ప్రకటనతో 2020 ఏడాదికి నోబెల్‌ అవార్డులు ప్రకటించటం పూర్తయింది.  

స్వెరిజెస్‌ రిక్స్‌బ్యాంక్‌ ప్రైజ్‌

నోబెల్‌ బహుమతులను స్వీడిష్‌ పరిశోధకుడు ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ 1895లో స్థాపించగా, 1901నుంచి ఇవ్వటం ప్రారంభించారు. మొదట్లో ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ ఇచ్చేవారు కాదు. 1969లో స్వీడన్‌ కేంద్రబ్యాంకు రిక్స్‌బ్యాంకు చొరవతో ఎకనమిక్‌ సైన్స్‌లోనూ ఇవ్వటం మొదలుపెట్టారు. మొదట్లో ఈ పురస్కారాన్ని స్వెరిజెస్‌ రిక్స్‌బ్యాంక్‌ ప్రైజ్‌ అని పిలిచేవారు.  


logo