బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 13:40:06

మరిన్ని చైనా ఎంబసీలు మూసివేసే అవకాశముంది: ట్రంప్

మరిన్ని చైనా ఎంబసీలు మూసివేసే అవకాశముంది: ట్రంప్

వాషింగ్టన్: మరిన్ని చైనా రాయబార కార్యాలయాలు మూసివేసే అవకాశమున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హౌస్టన్‌లోని చైనా ఎంబసి మూసివేతపై స్పందించారు. అమెరికాలో ఉన్న మరిన్ని చైనా రాయబార కార్యాలయాలను మూసివేస్తారా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా ఈ మేరకు సమాధానం ఇచ్చారు. హౌస్టన్ చైనా రాయబార కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగినట్లుగా తొలుత తాము భావించామని ట్రంప్ చెప్పారు. అయితే కాగితాలు, డాక్యుమెంట్లను చైనా అధికారులు కాల్చివేసినట్లుగా తెలిసిందన్నారు. వారు ఇలా చేయడం పట్ల తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు.

చైనాకు చెందిన సాంకేతిక నిఫుణులు అమెరికాలో చాలా ఏండ్లుగా గూఢచర్యం, హ్యాకింగ్ వంటి చట్ట విరుధ్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో టెక్సాస్‌లోని హౌస్టన్‌లో ఉన్న చైనా రాయబార కార్యాలయాన్ని 72 గంటల్లో ఖాళీ చేయాలని అమెరికా ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. అమెరికాతో పాటు ఐరోపా దేశాలకు చెందిన మేధో సంపత్తిని చైనా దోచుకుంటున్నదని అమెరికా ఆరోపించింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్న బయో టెక్నాలజీ సంస్థల కంప్యూటర్లను హ్యాకింగ్ చేసిన ఇద్దరు చైనా దేశీయులను అమెరికా న్యాయస్థానం మంగళవారం దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో హౌస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేశాలని అమెరికా ఆదేశించింది.
logo