బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Jan 24, 2020 , 00:56:23

ఐదు నగరాలు దిగ్బంధం!

ఐదు నగరాలు దిగ్బంధం!
  • ప్రజారవాణా నిలిపివేత
  • పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • నగరాలను విడిచివెళ్లొద్దని ప్రజలకు సూచన
  • కరోనా వైరస్‌ కట్టడికి చైనా చర్యలు

వుహాన్‌, జనవరి 23: ప్రాణాంతక కరోనా వైరస్‌  కట్టడికి చర్యలను చైనా ముమ్మరం చేసింది. ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబీ ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంతోపాటు ఐదు ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 630 మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. వుహాన్‌ నగరంలో అక్రమంగా సీఫుడ్‌ను విక్రయిస్తున్న మార్కెట్‌ కేంద్రంగా ఈ కరోనా వైరస్‌ (2019-ఎన్‌సీఓవీ) వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు. వుహా న్‌, హువాన్‌గాంగ్‌, ఎజౌ, జిజియాంగ్‌, కియాంజియాంగ్‌ నగరాల్లో ప్రజారవాణాను నిలిపివేస్తున్నట్లు గురువారం అధికారులు ఆదేశాలు జారీచేసినట్లు ఆ దేశ అధికారిక మీడి యా తెలిపింది. ప్రత్యేక కారణం లేనిదే ప్రజ లు నగరాన్ని విడిచి వెళ్లరాదని అధికారులు సూచించారు. సుమారు 1.1 కోట్ల మంది జనాభా కల వుహాన్‌లో విమాన, రైలు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. టోల్‌వేస్‌ను మూసివేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉండే వుహాన్‌ రైల్వే స్టేషన్‌ తాజా ఆంక్షలతో బోసిపోయింది.  ఉదయం 10 గంటలకే అధికారులు స్టేషన్‌ను అధీనంలోకి తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేశారు. మరోవైపు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అతికొద్ది మంది మాత్రమే మాస్క్‌ లు ధరించి బయటకు రావడం కనిపించింది. ప్రజారవాణాను నిలిపివేయడంతో వుహాన్‌లో ట్యాక్సీ డ్రైవర్లు చార్జీలను మూడు రెట్లు పెంచా రు. 


‘ఈ పరిస్థితుల్లో బయటకు రావడం అ త్యంత ప్రమాదకరం. కానీ మేం డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉన్నది’ ఒక డ్రైవర్‌ అన్నారు. కాగా, వుహాన్‌ నగరానికి వెళ్లని వారికీ వైరస్‌ సోకినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదకర స్థాయిలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని వుహాన్‌కు చెందిన వైద్యుడు ఒకరు తెలిపారు. చైనాలో శుక్రవారం నుంచి నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానుండగా, కరోనా వైరస్‌ ప్రబలడంతో వేడుకల కళ తప్పింది. 2002-03లో  చైనా, హాంకాంగ్‌ల లో సుమారు 800 మందిని బలితీసుకున్న సార్స్‌ తరహాలో ఈ వైరస్‌ ఉండడంతో ప్రజ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్‌ 31న వైరస్‌ తాలూకు తొలి కేసు నమోదు కాగా, అనంతరం ఇది చైనాను దాటి జపాన్‌, హాంకాంగ్‌, అమెరికా, మకావ్‌, తైవాన్‌, దక్షిణకొరియా, థాయ్‌లాండ్‌లకు కూడా వ్యాపించింది. తాజాగా సింగపూర్‌లోనూ తొలి కేసు నమోదుకాగా, వియత్నాంలోనూ ఇద్దరికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. 


వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బుధవారం అత్యవసరంగా సమావేశమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ).. అంతర్జాతీయ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించే విషయంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీనిపై గురువారం మరోసారి సమావేశమైంది. కరోనా వైరస్‌పై ఇప్పుడే గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించలేమని పేర్కొంది.కాగా, వైరస్‌ నియంత్రణకు చైనా పటిష్ఠ చర్యలను చేపడుతున్నదని డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి  ప్రశంసించారు. వుహాన్‌ నుంచి బయటకు ప్రయాణాలపై నిషేధం విధించినప్పటికీ, నగరంలోకి మాత్రం రైళ్లను, విమానాలను అనుమతిస్తున్నారు. మరోవైపు, నగర పర్యాటక విభాగం ఫిబ్రవరి 8 వరకు గ్రూప్‌ టూర్లను రద్దు చేసింది. న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా నిర్వహించే పబ్లిక్‌ ఈవెంట్లను కూడా నిలిపివేసింది.


పాముల నుంచి వైరస్‌ వ్యాప్తి!

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ పాముల నుంచి మనుషులకు సంక్రమించి ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి వైరస్‌ ప్రబలకుండా వ్యూహాలు రచించేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మెడికల్‌ వైరాలజీ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. కరోనా వైరస్‌ మూలాలపై ఇందులో చర్చించారు. 2019-ఎన్‌సీవోవీకు సంబంధించి సమగ్ర జన్యు విశ్లేషణ జరిపి, దానిని ఇతర కరోనా వైరస్‌లతో పోల్చి చూడగా.. తాజా వైరస్‌ గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్‌తోపాటు గుర్తుతెలియని మరో కరోనా వైరస్‌ నుంచి ఏర్పడిందని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం మరింత లోతుగా పరిశోధనలు జరుపగా, 2019-ఎన్‌సీవోవీ వైరస్‌ మనుషులకు సంక్రమించడానికి ముందు పాముల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు.


logo