గురువారం 28 మే 2020
International - Apr 20, 2020 , 21:59:05

ఎయిడ్స్‌ను తొలిసారి అమెరికాలో గుర్తించారు.. దానికి ఆ దేశం బాధ్య‌త తీసుకున్నాదా ?

ఎయిడ్స్‌ను తొలిసారి అమెరికాలో గుర్తించారు.. దానికి ఆ దేశం బాధ్య‌త తీసుకున్నాదా ?

హైద‌రాబాద్‌: ఒక‌వేళ‌ వైర‌స్‌ను ఉద్దేశ‌పూర్వకంగానే చైనా వ‌దిలితే.. ఆ దేశం తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. దీనిపై డ్రాగ‌న్ దేశం ఘాటుగా స్పందించింది. బాధ్య‌తారహితమైన‌ వ్యాఖ్య‌లు చేయ‌డం అమెరికా మానుకోవాల‌ని చైనా పేర్కొన్న‌ది. ఆ దేశ విదేశాంగ శాఖ‌కు చెందిన ప్ర‌తినిధి జెంగ్ షువాంగ్ ఇవాళ మీడియాతో మాట్లారు. వాస్త‌వాల‌ను, సైన్సును అమెరికా గౌర‌వించాల‌న్నారు. బాధ్య‌తార‌హిత‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం మానేయాల‌న్నారు. వైర‌స్ దాడిలో చైనా కూడా బాధిత దేశ‌మే అని, ఇత‌ర దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌ట్లే మ‌మ్మ‌ల్ని కూడా వైర‌స్ పీడించింద‌ని జెంగ్ తెలిపారు.  

వైర‌స్ క‌ట్ట‌డి కోసం పారద‌ర్శ‌కంగా చైనా ప‌నిచేసింద‌న్నారు. మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ఎన్నో త్యాగాలు చేశామ‌న్నారు. ప్ర‌జల జీవితాలు సంక్షోభంలో ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వాల‌న్నీ క‌లిసి ప‌నిచేయాల‌ని జెంగ్ అన్నారు. మ‌హమ్మారిని అడ్డుకోవాలంటే ప్ర‌పంచ దేశాలు ఏకం కావాల‌న్నారు. స‌మయాన్ని వృధాపోనివ్వ‌కుండా ప్రాణాల‌ను ర‌క్షించాల‌న్నారు.  ఒక‌రిపై ఒక‌రు నింద‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. ట్రంప్ హెచ్చ‌రించిన తీరును త‌ప్పుప‌ట్టిన చైనా.. గ‌తంలో అమెరికా ఎప్పుడూ ఇలాంటి ప్ర‌క్రియ‌లు పాటించి ఉండ‌ద‌న్నారు. గ‌తంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంక్షోభం వ‌చ్చిన‌ప్పుడు దానికి అమెరికా బాధ్య‌త తీసుకున్నదా అని చైనా ప్ర‌శ్నించింది. 

2009లో హెచ్‌1ఎన్‌1 ప్లూ అమెరికాలో ప్ర‌బ‌లింద‌ని, ఆ త‌ర్వాత సుమారు 214 దేశాల‌కు అది వ్యాపించంద‌ని చైనా పేర్కొన్న‌ది. ఆ ఫ్లూ వ‌ల్ల సుమారు రెండు ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు, దానికి అమెరికా బాధ్య‌త తీసుకున్నదా అని జెంగ్ ప్ర‌శ్నించారు. 1980వ ద‌శ‌కంలో అమెరికాలో హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి వ్యాపించింద‌ని, ఆ త‌ర్వాత ఆ దేశం నుంచి మిగితా దేశాల‌కు పాకిందని, మ‌రి అప్పుడు అగ్ర‌రాజ్యం బాధ్య‌త తీసుకున్న‌దా అని అడిగారు. 2008లోనూ అమెరికాలో వ‌చ్చిన ఆర్థిక సంక్షోభం.. అది ప్ర‌పంచ ఆర్థిక మంద‌గ‌మానికి దారి తీసింది, మ‌రి ఆ సంఘ‌ట‌న‌కు బాధ్య‌త తీసుకోవాల‌ని ఎవరైనా అమెరికాను ప్ర‌శ్నించారా అని చైనా ధ్వ‌జ‌మెత్తింది. వైర‌స్ వ‌ల్ల క‌లిగిన న‌ష్టానికి చైనానే న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌న్న అమెరికా వాద‌న‌ను డ్రాగ‌న్ ఈ ర‌కంగా కొట్టిపారేసింది.
logo