గురువారం 02 జూలై 2020
International - Jun 19, 2020 , 10:29:52

భార‌త భూభాగం కోసం.. చైనా ఆర్మీ రెచ్చ‌గొట్టింది: అమెరికా

భార‌త భూభాగం కోసం.. చైనా ఆర్మీ రెచ్చ‌గొట్టింది: అమెరికా

హైద‌రాబాద్‌: అమెరికా సీనియ‌ర్ నేత, సేనేట‌ర్ మిచ్ మెక్‌క‌న‌ల్‌.. చైనా సైన్యం వైఖ‌రిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబ‌రేష్మ‌న్ ఆర్మీయే.. గాల్వ‌న్ లోయ‌లో భార‌తీయ సైనికుల‌ను రెచ్చ‌గొట్టింద‌ని మిచ్ తెలిపారు. సేనేట్ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. కేవ‌లం భారత భూభాగాన్ని అక్ర‌మించాల‌న్న ఉద్దేశంతోనే.. భార‌తీయ సైన్యాన్ని చైనా ఆర్మీ రెచ్చ‌గొట్టిన‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాల‌ను కూడా చైనా కావాల‌నే టార్గెట్ చేస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. రెండు అణ్వాయుధ దేశాలు స‌రిహ‌ద్దుల్లో కొట్టుకున్న తీరును ప్ర‌పంచ దేశాలు గ‌మ‌నించాయ‌ని, ఉద్రిక్త‌త‌లు త‌గ్గాల‌ని కోరుకుంటున్నామ‌ని, శాంతి కాంక్షిస్తున్నామ‌ని మెక్ క‌న‌ల్ తెలిపారు. 

స‌రిహ‌ద్దుల వ‌ద్ద ప్ర‌జ‌ల‌ను అత్యంత కిరాతంగా చంపి.. అంత‌ర్జాతీయ హ‌ద్దుల్ని చైనా మారుస్తున్న‌ట్లు సేనేట‌ర్ ఆరోపించారు.  మ‌హమ్మారిని అడ్డు పెట్టుకుని .. హాంగ్‌కాంగ్‌ను ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు చైనా క‌మ్యూనిస్టు పార్టీపై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.  జ‌పాన్ వ‌ద్ద ఉన్న‌ శంక‌కూ దీవుల్లోనూ చైనా త‌న సైన్యాన్ని మోహ‌రిస్తున్న‌ట్లు ఆరోపించారు.  ఇక ఆకాశంలోనూ చైనా జెట్ విమానాలు.. తైవాన్ గ‌గ‌న‌త‌లంలోకి దూసుకువెళ్లిన‌ట్లు విమ‌ర్శించారు.  చైనా క‌మ్యూనిస్టు పార్టీని త‌రిమికొట్టాల్సిందే,  ఇండియా దీంట్లో వెనుకాడ‌ద‌ని తెలుసు, భార‌త్ గ‌ట్టి నిర్ణ‌య‌మే తీసుకున్న‌ద‌ని మ‌రో సేనేట‌ర్ జిమ్ బ్యాంక్స్ తెలిపారు.
logo