చైనా టీకా 79 శాతం ప్రభావవంతం..

బీజింగ్: చైనాకు చెందిన సైనోఫార్మ్ సంస్థ కరోనా వైరస్‌కు టీకాను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ టీకా సుమారు 79 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు ఆ కంపెనీ చెప్పింది. సైనోఫార్మ్ సంస్థ మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. అయితే ఫైజర్-బయోఎన్‌టెక్, మోడెర్నా టీకాలతో పోలిస్తే.. సైనోఫార్మ్ టీకా తక్కువ ప్రభావవంతంగా ఉన్నట్లు తేలింది. పశ్చిమ దేశాలతో ధీటుగా చైనా తమ సొంతం వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నది. ఇప్పటికే అయిదు కంపెనీలు భారీ స్థాయిలో మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. వ్యాక్సిన్ క్యాండిడేట్ డేటాను మాత్రం చైనా తొలిసారి బుధవారం రిలీజ్ చేసింది. కోవిడ్19పై సైనోఫార్మ్ టీకా 79.34 శాతం సురక్షితంగా ఉన్నట్లు బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ పేర్కొన్నది. దేశీయ డ్రగ్ రెగ్యులేటర్‌కు టీకా ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సైనోఫార్మ్ తెలిపింది. సైనోఫార్మ్ సంస్థకు చెందిన వ్యాక్సిన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆమోదం తెలిపింది. చాలా చౌకైన ధరకే టీకాను అందుబాటులోకి తేనున్నట్లు ఆ సంస్థ చెప్పింది.