గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 23, 2020 , 01:49:37

చైనా కొత్త కుట్ర!

చైనా కొత్త కుట్ర!

  • భూటాన్‌ భూభాగంలో గ్రామం నిర్మాణం
  • సైనిక స్థావరాలు, బంకర్ల ఏర్పాటు
  • శాటిలైట్‌ చిత్రాల ద్వారా వెల్లడి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నా చైనా.. భారత్‌తో కయ్యాలు మానుకోవడంలేదు. మన పొరుగుదేశం భూటాన్‌లో.. వివాదాస్పద ప్రాంతం డోక్లాం సమీపంలో తాజాగా సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడంతోపాటు ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించింది. దాన్ని ఆనుకొని ఓ రహదారిని కూడా నిర్మించింది. దీంతో ఈశాన్య భారత్‌లోని కీలక ప్రాంతాలపై చైనా సైన్యం నిఘాను పెంచే అవకాశమున్నది. భూటాన్‌లోని తోర్సా నదికి తూర్పు దిశగా ఉన్న లోయల్లో ‘పంగ్డా’ పేరిట చైనా ఓ గ్రామాన్ని నిర్మించింది. భూటాన్‌ భూభాగంలో 2 కిలోమీటర్ల లోపల ఈ గ్రామాన్ని నిర్మించింది. ఇది డోక్లాం ప్రాంతానికి సమీపంలో ఉన్నది. పంగ్డా గ్రామానికి ఆనుకొని చైనా ఓ రహదారిని కూడా నిర్మించింది. భూటాన్‌ భూభాగంలో సుమారు 9 కిలోమీటర్ల లోపల ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మేరకు ‘మ్యాక్స్‌ర్‌ టెక్నాలజీ’ అనే సంస్థ విడుదల చేసిన శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. పంగ్డా గ్రామంలో జనావాసాలు మొదలయ్యాయని, అక్కడ చైనా సైన్యం.. బంకర్లు, ఆయుధాల నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిందని చైనా మీడియా సంస్థ ‘సీజీటీఎన్‌' సీనియర్‌ ప్రొడ్యూసర్‌ షెన్‌ షివెయ్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో పలు ఫొటోలను పోస్ట్‌ చేశారు. అయితే, తమ భూభాగాల్లో చైనా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని భూటాన్‌ వాదిస్తున్నది. అయితే చైనా బెదిరింపుల వల్లే భూటాన్‌ ఈ విషయంలో నిజాల్ని దాచిపెడుతున్నదని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. 2017లో డోక్లాంలో రోడ్డు నిర్మాణానికి చైనా పూనుకున్నది. దీనిని భూటాన్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. భూటాన్‌కు భారత్‌ అండగా నిలిచింది. ఫలితంగా చైనా-భారత సైన్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. చైనా సేనలు కీలకమైన జోంపెల్రీ పర్వత ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవడంలో భారత సైన్యం సఫలమైంది. అయితే  చైనా ఇప్పుడు ఏకంగా భూటాన్‌లో గ్రామాన్ని, రహదారిని నిర్మించింది. ఈ రోడ్డు నిర్మాణంతో డ్రాగన్‌ దేశం సేనలు సులభంగా జోంపెల్రీకి చేరుకోవచ్చని, అటునుంచి ఈశాన్య భారత్‌లోకి చొరబాట్లకు పాల్పడే ప్రమాదమున్నదని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత సైన్యం.. సొరంగ వ్యూహం

తూర్పు లఢక్‌లో ఒకవైపు చలి, మరోవైపు చైనా కుట్రలను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధమైంది. చలి నుంచి, శత్రుదాడుల నుంచి సైన్యానికి భద్రత కల్పించడానికి పెద్ద కాంక్రీటు సొరంగాలను నిర్మించింది. 6 -8 అడుగుల వ్యాసంతో నిర్మించిన ఈ సొరంగాల ద్వారా భూమి లోపల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కూడా చేరుకోవచ్చని సైనికాధికారులు తెలిపారు. జపాన్‌తో జరిగిన దేశ విముక్తి యుద్ధంలో నాటి చైనా సైన్యం, అమెరికాతో జరిగిన గెరిల్లా వార్‌లో వియత్నాం, కొరియన్‌ వార్‌లో అమెరికాపై ఉత్తర కొరియా.. బలగాల రక్షణకు సొరంగాలను నిర్మించుకున్నాయి.