గురువారం 04 జూన్ 2020
International - Apr 24, 2020 , 15:33:38

మార్స్ మిష‌న్‌కు పేరు పెట్టిన చైనా..

మార్స్ మిష‌న్‌కు పేరు పెట్టిన చైనా..

హైద‌రాబాద్‌: డ్రాగ‌న్ దేశం అంగార‌కుడి వేట‌లో ప‌డింది. మార్స్ గ్ర‌హంపై అన్వేష‌ణ కోసం ప్ర‌యోగించే మిష‌న్‌కు పేరును ప్ర‌క‌టించింది.  ఆ మిష‌న్‌కు తియాన్‌వెన్‌-1 పేరును చైనా పెట్టింది.  ఇవాళ 50వ స్పేస్ డేను చైనా జ‌రుపుకుంటున్న‌ది.  ఇదే రోజున‌ 1970లో డాంగ్ ఫాంగ్ హంగ్ అనే తొలి శాటిలైట్‌ను చైనా లాంచ్ చేసింది. భార‌త్‌, అమెరికా, ర‌ష్యా, యూరోప్ దేశాల త‌రహాలో అంత‌రిక్షంలో దూసుకువెళ్లాల‌నుకుంటున్న చైనా .. మార్స్ మిష‌న్ కోసం భారీగా ప్రిపేర‌వుతున్న‌ది.  ఒకేఒక్క మిష‌న్‌తో ఆర్బిటింగ్‌, ల్యాండింగ్, రోవింగ్‌ల‌ను పూర్తి చేయాల‌ని చూస్తున్న‌ది.  మార్స్ మిష‌న్‌కు తియాన్‌వెన్ అని చైనా నేష‌న‌ల్ స్పేస్ అడ్మినిస్ట్రేష‌న్ పేరు పెట్టింది.  

తియాన్‌వెన్ అంటే స్వ‌ర్గ‌లోకం అని, స్వ‌ర్గ‌లోకాన్ని ప్ర‌శ్నిస్తున్న‌ట్లు అర్థం వ‌స్తుంది.  చైనా మేటి క‌వి కూ యువాన్ రాసిన ప‌ద్యం ఆధారంగా ఈ పేరును ఫిక్స్ చేశారు. మార్స్ గ్ర‌హాన్వేష‌ణ‌లో భాగంగా 2011లో చైనా ఓ సారి ర‌ష్యా స‌హాయంతో యింగ్వూ-1 అనే ప్రయోగాన్ని చేప‌ట్టింది. కానీ అది విఫ‌ల‌మైంది. 2014లో విజ‌య‌వంతంగా మంగ‌ళ‌యాన్‌ను ప్ర‌యోగించిన భార‌త్‌.. ఆసియా దేశాల్లో ప్ర‌థ‌మ దేశంగా నిలిచింది. తియాన్‌వెన్‌-1 మిష‌న్‌ను ఈ ఏడాదే చైనా చేప‌ట్ట‌నున్న‌ది.logo