మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 19, 2020 , 02:32:38

తైవాన్‌పై చైనా దురాక్రమణ?

తైవాన్‌పై చైనా దురాక్రమణ?

బీజింగ్‌, అక్టోబర్‌ 18: విస్తరణ కాంక్షతో పొరుగుదేశాలన్నింటితో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా మరో దుస్సాహసానికి ప్రణాళికలు వేస్తున్నది. కమ్యూనిస్టు దేశం ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు ఎదిరిస్తూ స్వతంత్రతను కాపాడుకుంటూ వస్తున్న ద్వీపదేశం తైవాన్‌ను పూర్తిగా ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నది. అందుకోసం తైవాన్‌ చుట్టూ చైనా ప్రధాన భూభాగంలో అత్యాధునిక క్షిపణులను మోహరించింది.  

జిన్‌పింగ్‌ నోట యుద్ధం మాట

గత మంగళవారం గ్వాంగ్‌డాంగ్‌ మిలిటరీ బేస్‌ను సందర్శించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, యుద్ధానికి సిద్ధం కావాలని సైన్యానికి పిలుపునిచ్చారు. చావోఝావ్‌లోని మెరైన్‌ కార్ప్స్‌ను సందర్శించిన సమయంలో కూడా ఆయన మెరైన్‌ దళాలకు ఇదే సూచన చేశారు. ఏడాది వ్యవధిలోనే తైవాన్‌ చుట్టూ చైనా సైన్యం పదుల సార్లు యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. గత నెల 18-19 తేదీల్లో 40 చైనా యుద్ధవిమానాలు తైవాన్‌ భూభాగం మీదుగా దూసుకుపోయాయి. ఈ యుద్ధోన్మాదంపై తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దశాబ్దం క్రితమే తైవాన్‌ సమీపంలోని చైనా క్షిపణులు మోహరించింది.


logo